calender_icon.png 12 October, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికొండ మున్సిపాలిటీలో బంధు‘రాజ్యం’

12-10-2025 08:42:12 PM

అవుట్ సోర్సింగ్ పోస్టులన్నీ వారికే..

ఒకే కుటుంబానికి మూడు ఉద్యోగాలు..

స్థానికులకు అందని కీలక పదవులు..

మ‌ణికొండ‌ (విజయక్రాంతి): మణికొండ మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులకు అన్యాయం చేస్తూ, ఒకే కుటుంబానికి చెందిన వారికి కీలక పోస్టులు కట్టబెడుతున్నారని, ఇది పెద్దఎత్తున అవినీతికి దారితీస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. మూడు గ్రామాలు కలిసి మణికొండ మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ, పరిపాలనలో స్థానికుల పాత్ర నామమాత్రంగానే మిగిలిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని కీలకమైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో మణికొండకు చెందిన అర్హులు ఒక్కరు కూడా లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇజినీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ వంటి కీలక విభాగాల్లో స్థానికంగా ఎంతో నైపుణ్యం కలిగిన యువత ఉన్నప్పటికీ, వారిని కనీసం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కూడా నియమించకుండా బంధువులకు, స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బయటివారికే ప్రాధాన్యత ఇస్తూ, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఒకే రకమైన పోస్టులు కేటాయించడం బంధుప్రీతికి, అవినీతికి అద్దం పడుతోందని మణికొండ మాజీ సర్పంచ్ యల్లాల నరేష్ ఆరోపించారు. ఈ నియామకాల వెనుక పెద్దల హస్తం ఉందని, దీనివల్ల మున్సిపాలిటీలో పారదర్శకత లోపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకు జరగాల్సిన మేలు కొందరికే పరిమితం అవుతోందని, దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు ఒకే పోస్టులో పనిచేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన అంగీకరించారు. ఈ విషయంపై ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించామని తెలిపారు. విచారణలో వాస్తవాలు తేలిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలను సరిదిద్దుతామని, స్థానికులకు న్యాయం జరిగేలా చూస్తామని శ్రీనివాస్ హామీ ఇచ్చారు.