calender_icon.png 12 October, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేమెంతో మాకంతా.. బరాబర్ మా 'వాటా’ మాదే

12-10-2025 08:38:40 PM

రిజర్వేషన్ అడ్డంకులపై ఓబీసీ వేదికగా రగులుతున్న బీసీలు..

ఓరుగల్లులో ఒక్కటవుతున్న మేథావులు, విద్యార్థులు, కుల సంఘాలు..

ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో సమావేశమైన సామాజిక ఉద్యమ సంస్థలు..

హనుమకొండ (విజయక్రాంతి): ఉద్యమాల పురిటి గడ్డ, ఉత్తర తెలంగాణ కేంద్రంగా బీసీ ఉద్యమం రగులుకుంటోంది. 42% రిజర్వేషన్ పట్ల ప్రధాన రాజకీయ పార్టీలు, రెడ్డి జాగృతి లాంటి అగ్రవర్ణ సంస్థలు అనుసరిస్తున్న విధానాలపై బీసీ సంఘాలు, మేథావుల, విద్యార్థులు సంఘటితంగా గొంతెత్తారు. ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ నేత్రుత్వంలో, ఆయన అధ్యక్షతన హనుమకొండ రాంనగర్ లోని బీసీ భవన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సామాజిక సంస్థలు, కుల సంఘాలు, మేథావి వర్గం పలు కీలక తీర్మాణాలు చేశారు. తెలంగాణ సాధన కోసం సబ్బండ వర్గాలు ఏ రకంగా కదిలాయో అదే తీరులో బీసీ రాజ్యాధికారం కోసం మరో ఉద్యమం సామాజిక తెలంగాణ కోసం ఆవిర్భవించాలని సమావేశం ఏక కంఠంతో ప్రకటించింది.

తెలంగాణ సాధన కోసం సమరం సాగించిన బలహీన వర్గాల ప్రజలు ప్రస్తుతం తమ కోసం తాము ఉద్యమం చేయాల్సిన చారిత్రక అవసరం ఉత్పన్నమైందని మేథావులు అభిప్రాయపడ్డారు. 42% రిజర్వేషన్ సాధన కోసం, చట్ట సభల్లో ప్రాతినిథ్యం కోసం బీసీలు, ఎంబీసీలు రాజకీయ పార్టీలను, అగ్రవర్ణ సంస్థలను యాచించడం కాదని, ఉద్యమ పంథాతో శాసించే స్థాయికి చేరాలని కోరారు. బీసీ రిజర్వేషన్ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న దోబుచులాటపై, మభ్యపెట్టే ధోరణిపై బీసీ ఉద్యమకారులు, కుల సంఘాల ప్రతినిధులు మండి పడ్డారు. అట్టడుగు స్థాయి నుంచి చట్ట సభల్లో అడుగుపెట్టే పరిణామం వరకు అన్ని స్థాయిల్లో బీసీ ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా రూపుదిద్దాలని, దాని కోసం ప్రజల్లో సామూహిక చైతన్యం, సంఘటిత ఉద్యమానికి సకల జనులంతా శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

బీసీ రిజర్వేషన్ సాధన పరిణామాలపై ఏర్పడుతున్న అవాంతరాలపై బీసీ కులాలు, మేథావులు, విద్యార్థులు, సామాజిక సంస్థలను ఒకే తాటిపై తీసుకు వచ్చి అత్యవసర సమావేశం నిర్వహించి అధ్యక్షత వహించిన ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సమాజంలోని బీసీలు బలహీనులు కాదని, బాహుబలులనే సంగతిని పాలక పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని బాహుబలుల బలమేంటే తెలంగాణ సాధన ఉద్యమంలో బీసీల పాత్ర రుజువు చేసిందని, సాయుధ పోరాటంలోనూ నైజాంను తరిమిన గతం గమనంలో ఉందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ అనేది సమాజంలో సగం కంటే ఎక్కువగా ఉన్న బీసీల పౌరహక్కు అని, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీసీ బిడ్డల బలిదానాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాధికార పోరాటంలో ‘సామాజిక తెలంగాణ’ తమ జన్మహక్కు అని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.

బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తామని ఆశ చూపి అధికార కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తున్నా, దానిని తమాషా చూస్తున్న ప్రధాన పార్టీల భరతం బీసీలు పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. హైకోర్టులో పిటిషన్ వేసి బీసీ బిడ్డల  42 శాతం రిజర్వేషన్ నోటికాడి కూడును లాక్కోవాలని చూస్తున్న రెడ్డి జాగృతి సంస్థ తీరు నీచమైన ఆలోచన అని, దానిని సమర్థించే తీరులో తాత్సారం చేస్తున్న చర్చలు ప్రదాన పార్టీల దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. బీసీలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పిల్ వచ్చినా, పిల్లి వచ్చినా అడ్డంకులను అధిగమించి హామీ నెరవేర్చకుంటే బీసీల తఢాకా చూస్తుందని అన్నారు. రెడ్డి జాగృతి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలు చర్చించి పిటిషన్ వెనక్కి తీసుకునేలా చేయాలని బీసీల తరుపున అల్టిమేటమ్ జారీ చేస్తున్నట్టు సుందర్ రాజ్ యాదవ్ ప్రకటించారు.

ఇప్పటి వరకు తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వాళ్లం కలిసి బతుకుతున్నామని, ఇప్పటికైనా కొంత మంది అగ్రవర్ణ నేతలు, సంస్థలు వివక్ష పూరిత ధోరణి మానుకొని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని కోరారు. బహుజనులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో  అగ్రవర్ణాలు ఆధిపత్య ధోరణితో రాజ్యాధికారం చేయడం బీసీ వ్యతిరేక కుట్రను బయట పెడుతోందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో న్యాయపరంగా చిక్కులు లేకుండా బీసీ బిల్లును తీసుకువచ్చి బీసీలకు న్యాయం చేయాలని, రాజకీయ పార్టీలలో కుర్చీలు వేయడానికి, కార్యక్రమాలు నిర్వహించడానికి బీసీలు కావాలి కానీ రాజ్యాధికారం చేపట్టడానికి, చట్ట సభల్లో కూర్చోడానికి బీసీలు పనికి రారా అని సుందర్ రాజ్ యాదవ్ ప్రశ్నించారు.

బీసీలోని అన్ని సామాజిక సంస్థలు, అన్ని కుల సంఘాలు, విద్యార్థులు, మేథావులను కలుపుకొని జేఏసీగా ఏర్పడి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాని సుందర్ రాజ్ యాదవ్ ప్రకటించారు. వరంగల్ కేంద్రంగా జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆరంభ మాత్రమేనని, రానున్న రోజుల్లో ఓరుగల్లు నుండి బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని పాలక పార్టీలు, సహా ప్రధాన పార్టీలను సుందర్ రాజ్ యాదవ్ హెచ్చరించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో పరిపాలించిన రెండు జాతీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని, కాంగ్రెస్ కామారెడ్డిలో పెట్టిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. బీసీలకు ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ ప్రతి ఏడాది ప్రకటించాలని,  ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో కూడా 42 శాతం బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. విద్య, వైద్య రంగాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలలో కూడా 42% బీసీలకు అవకాశాలు కల్పించాలని, మెడికల్ ఇంజనీరింగ్ సీట్లలో విద్యార్థులకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.

బీసీ రిజర్వేషన్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్ష బ్రుందాన్ని ఢిల్లీకి తీసుకపోవాలని డిమాండ్ చేశారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఓబిసి ఉపాధ్యక్షురాలు డా. విజయ లక్ష్మీ, ఓబీసీ కోశాధికారి రాజేష్ కుమార్, ఓబీసీ జాయింట్ సెక్రెటరీ వేణుమాధవ్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బిసి మహసేన రాష్ట్ర కన్వీనర్ తడిశెట్టి క్రాంతి కుమార్, ముదిరాజ్ నాయకులు పులి రజనీకాంత్, ప్రొఫెసర్ సిఎచ్ రాములు, కమల్ కుమార్, బెనర్జీ, అఖిలభారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాజయ్య యాదవ్, కాపు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకయ్య,వైద్యం రాజగోపాల్, బిసి మహసేన కో- కన్వీనర్ గొల్లపల్లి వీరస్వామి, అడ్వకేట్ సర్జు మోహన్, ఓబీసీ యూత్ నాయకులు మౌనిక గౌడ్,ఆరె క్షత్రియ నాయకులు మనోహర్ రావు, భిక్షపతి, శ్రీధర్ రాజు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.