calender_icon.png 16 October, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దృష్టి మరల్చి నగలు అపహరణ..

15-10-2025 10:43:53 PM

నడిరోడ్డుపై బైక్ ఆపి ఐదున్నర తులాల బంగారం అపహరణ

పాపన్నపేట (విజయక్రాంతి): బంగారం ఇంత మొత్తంలో మెడలో వేసుకుని తిరిగితే దొంగలు ఎత్తుకెళ్తారు.. జాగ్రత్త అంటూ.. భార్యాభర్తల దృష్టి మరల్చి దుండగులు బంగారం చోరీకి పాల్పడిన సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి బ్రిడ్జి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ సమాచారం మేరకు.. మండల పరిధిలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన భూసనెల్లి కిషన్ అతడి భార్య మాణెమ్మ( ఏడుపాయల ఆలయ పాలకమండలి మాజీ డైరెక్టర్) ఇరువురు కలిసి తమ బంధువుల వద్దకు విందుకోసం టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లుపేట గ్రామానికి స్కూటీపై బయలుదేరారు.

కొత్తపల్లి బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా బైక్ పై వచ్చిన ఇరువురు దుండగులు వారిని ఆపి మేము ఆఫీసర్లమని, ఇంత నగలు వేసుకొని తిరగడం మంచిది కాదని వారికి నచ్చ చెప్పారు. వాటిని తీసి ముల్లె కట్టి డిక్కీలో వేసుకోమని చెప్పడంతో మానెమ్మ తమ మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు, తులంనర బంగారు గుండ్లను హ్యాండ్ కర్చిప్ లో కట్టి డిక్కిలో వేశారు. ఇదే అదనుగా భావించిన దుండగులు వారిని మైమరిపించి ఆ నగలను తస్కరించి పారిపోయారు. కొద్ది దూరం వారు వెళ్లిపోయాక బాధితులు డిక్కిలో చూసుకొని లబోదిబోమన్నారు. వెంటనే పాపన్నపేట పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.