calender_icon.png 1 December, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగవద్గీత పుస్తకాల పంపిణీ

01-12-2025 10:30:17 PM

మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని IIT చుక్కా రామయ్య హైస్కూల్‌లో సోమవారం భగవద్గీత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పక్షం ఏకాదశిన గీతా జయంతిని పాఠశాలలో జరుపుతుంటారు. ఇందులో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ వేషాధారణలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం సామూహిక గీతా పఠనం చేశారు. ఈ సందర్భంగా 500 భగవద్గీత పుస్తకాలను విద్యార్థులు ఇంటింటికి తిరిగి ఉచితంగా పంపిణీ చేస్తూ గీతా మహిమను ప్రజలకు తెలియజేశారు. రాంనగర్ లోని భగవద్గీత ధ్యాన మండలిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పాఠశాల కరస్పాండెంట్ కొమ్ము దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ‘గీతా జ్ఞానం మాత్రమే మానవతకు మార్గం’అని ప్రపంచంలో ఏ పుస్తకానికీ జయంతి ఉత్సవాలు జరపరు, కానీ భగవద్గీతకు మాత్రం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, గీతా ఔన్నత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. అందుకే తమ పాఠశాలలో భగవద్గీతను సైతం పాఠ్యాంశంగా బోధిస్తున్నామన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, మానవతా విలువలు క్షీణిస్తున్న ఈ కాలంలో సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మానసిక ఖాళీ అని, దానిని నింపగలిగేది ధనం, పదవి కాదని, గీతా జ్ఞానం మాత్రమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బర్మ తిరుపతి, భగవద్గీత ధ్యాన మండలి నిర్వాహకులు డాక్టర్ గుర్రాల కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.