నేటి నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ
-3.50 లక్షల ఎస్‌హెచ్‌జీలకు రూ.300 కోట్ల రుణాలు
-కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి
-సీఎం, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు: మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ర్టంలోని 3.50 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.300.40 కోట్ల వడ్డీలేని రుణాలను మం గళవారం నుంచి పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పంపిణీ పురోగతి, రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డేలేని రుణాల పంపిణీ అంశంపై సీఎస్ రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
పంచాయతీ రాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్టంలో మూడవ విడత వడ్డీలేని రుణాలను మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ర్టంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. వడ్డీ లేని రుణాల మొత్తం నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నందున ఎవరెవరికి ఎంత మొత్తం అందిందో సభ్యులకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా సాగుతోందని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందించడం పట్ల రాష్ర్టంలోని మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను కూడా అందించడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.
సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. జిల్లాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీని వేగవంతంగా పంపిణీ చేయడం పట్ల జిల్లా కలెక్టర్లను అభినందించారు. త్వరిత గతిన ఈ చీరెలను పూర్తిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి సంబంధిత జిల్లాల ఇంచార్జి మంత్రులు, జిల్లా నుండి ప్రాతినిధ్య వహించే మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించాలన్నారు.






