calender_icon.png 20 December, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికులకు స్వెట్టర్ల పంపిణీ

20-12-2025 01:50:53 AM

నూతనకల్, డిసెంబర్ 19:మానవత్వానికి నిలువుటద్దంగా నిలుస్తూ, నూతనకల్ గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పాత సూర్యాపేట నివాసి, ఎర్రపహాడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సామ సవేందర్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు.ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల దీనావస్థను చూసి సవేందర్ రెడ్డి మనసు చలించింది.

వారి కష్టాన్ని గుర్తించిన ఆయన, సుమారు పదివేల రూపాయల విలువైన స్వెటర్లను  సొంత ఖర్చుతో కొనుగోలు చేశారు.వీటిని నూతనకల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్మికులకు అందజేశారు.ఈ సందర్భంగా మల్టీపర్పస్ వర్కర్స్ సారధి శ్రీ నకిరేకంటి శంభయ్య మాట్లాడుతూ.. కార్మికులపై జాలి చూపి, బృహత్తరమైన దాతృత్వాన్ని ప్రదర్శించిన సవేందర్ రెడ్డిని ’కరుణా సముద్రుడు’ అని కొనియాడారు.

చలితో వణుకుతున్న తమకు ఈ వస్త్రాలు ఎంతో ఊరటనిస్తాయని కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. తమపై అపారమైన ప్రేమను చాటుకున్న సవేందర్ రెడ్డిని కార్మికులందరూ కలిసి ఘనంగా సన్మానించి, ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సేవా కార్యక్రమంలో పూజల కోటి, బండి చంద్రయ్య, యాస యుగంధర్ రెడ్డి, మరియు ఇతర గ్రామస్తులు పాల్గొని సేవేందర్ రెడ్డి చేసిన సేవను అభినందించారు.