calender_icon.png 20 December, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్ళీ భగ్గుమన్న బంగ్లా

20-12-2025 01:54:13 AM

‘ఇంక్విలాబ్ మంచా’ నేత ఉస్మాన్‌బీన్ హదీ మృతి

సింగపూర్‌లో తుదిశ్వాస

అట్టుడికిన ఢాకా

  1. అవామీ లీగ్ నేతల ఇళ్లకు నిప్పు
  2. ఒక హిందువు సజీవ దహనం.. భగ్గుమన్న మైనార్టీ వర్గాలు
  3. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ
  4. ‘బంగ్లా’లోని భారతీయులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు

ఢాకా, డిసెంబర్ 19: బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు పరిస్థితి చోటుచేసుకున్నాయి. ర్యాడికల్ ఇస్లామిక్ సంస్థ ‘ఇంక్విలాబ్ మంచా’ నాయకుడు, విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ (32) మరణవార్త దేశంలో అగ్గిరాజేసిం ది. వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారత్‌తోపాటు అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈనెల 12ను షరీఫ్ ఉస్మా న్ హాదిపై కాల్పులు జరపడంతో ఆయన్ను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అక్కడ చికిత్సపొందుతూ హదీ గురు వారం రాత్రి మృతిచెందాడు. ఈ వార్త దావానలంలా దేశమంతా వ్యాపించింది. తెల్లవా రేసరిసరికి పెద్ద ఎత్తున ఆందోళనలకు దారి తీసింది. ఆ దేశ రాజధానిలో నిరసనకారులు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేశారు. హదీపై కాల్పులు జరి పిన నిందితులు భారత్ పరారయ్యారని ఆరోపిస్తూ భారత దౌత్య కార్యాలయాల వైపు దూ సుకెళ్లారు. అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లి అక్కడి ఫర్నీచర్, సామగ్రిని ధ్వంసం చేశారు. 

ఆ దేశ జాతిపిత షేక్ ముజిబూర్ రెహమాన్, అవామీ లీగ్ పార్టీ నేత, చిట్టగాంగ్ నగర మాజీ మేయర్ మొహియుద్దీన్ నివాసాలకు నిప్పుపెట్టారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ ఛాయానట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. సంగీత వాద్యాలను ధ్వంసం చేశారు. చటోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. భారత్‌కు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించా రు.

భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. సీసీ టీవీల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిం చి కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ సాంస్కృతిక సలహాదారు ముస్తఫా సర్వర్ ఫారూఖీ ప్రకటించారు. మరోవైపు దౌత్య కార్యాలయాల్లో నిరసనకారుల దాడులపై బంగ్లాదేశ్ ఒత్తిడిని ఐక్యరాజ్యసమితి (ఐరాస)తో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఎదుర్కొంటున్నది. 

మీడియా కార్యాలయాలకు నిప్పు

ఆందోళనకారులు ‘ప్రొథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’తోపాటు పలు మీడియా సంస్థల కార్యాలయాలకూ నిప్పుపెట్టారు. ‘మాకు ఊపిరా డటం లేదు.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ మా ప్రాణాలు తీయబోతున్నాయి’ అంటూ ‘ది డైలీ స్టార్’ రిపోర్టర్ జైమా ఇస్లాం సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లు అక్కడి తీవ్రతను ప్రపంచానికి తెలియజేసింది. ఆయా కార్యాలయాల్లో దట్టమైన పొగలో చిక్కుకున్న 27 మందిని అగ్నిమాపక, ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడి భవనా ల పైకప్పుల నుంచి బయటకు తీసుకొచ్చారు. సీనియర్ సంపాదకుడు నూరుల్ కబ్‌పీపైనా నిరసనకారులు భౌతిక దాడికి దిగారు. ‘భారత ఏజెంట్’ అని దూషిస్తూ ఈ దాడులు చేశారు. 

నేడు హదీ అంత్యక్రియలు

2024లో అప్పటి ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేయడంలో షరీఫ్ ఉస్మాన్‌బిన్ హదీ ముఖ్యపాత్ర పోషించాడు. దేశవ్యాప్తంగా ఉద్యమ జ్వాలను రగిలించడంలో హదీ పాత్ర ఉంది. అందుకే ఆయనకు బంగ్లాదేశ్ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన మృతివార్తను వారు జీర్ణించుకలేకపోతున్నారు. హదీ మృతదేహం శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సింగపూర్ నుంచి ఢాకా విమానాశ్రయానికి చేరుకుంది.

దీంతో వేలాది మంది మద్దతుదారులు విమానాశ్రయం వద్దకు వచ్చారు. అక్కడ భారత్‌కు వ్యతిరేకమైన నినాదాలు చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పార్లమెంట్ భవనం ఎదుట ఉన్న మానిక్ మియా వేదికలో హదీ అంత్యక్రియలు నిర్వహిస్తామని అక్కడి యంత్రాంగం తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలను ఢాకాను మోహరించాయి.

హదీ మృతికి నివాళిగా శనివారం దేశవ్యాప్తంగా సంతాప దినం పాటించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. హదీ త్యాగాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించింది. ద్వేషాన్ని పెంచడం కాదని యూనస్ ప్రభుత్వం హితవు పలికింది.  

‘బంగ్లా’ కవ్వింపు చర్యలు

ఒకవైపు బంగ్లాదేశ్‌వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఆ దేశపు నావికాదళం బంగాళాఖాతంలో కవ్వింపుచర్యలకు పాల్పడుతున్నది. ఈ 15న అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు సమీపంలో 16 మంది భారత మత్స్యకారులు నడుపుతున్న బోటును బంగ్లాదేశ్ నావికాదళ నౌక ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. ఘటనలో బోటు సముద్రంలో మునిగింది. భారత కోస్ట్‌గార్డ్స్ అతికష్టం మీద 11 మంది మత్స్యకారులను రక్షించారు.

మరో ఐదుగురు మత్స్యకారులు మాత్రం గల్లంతయ్యారు. వారిలో ఒకరిని బంగ్లాదేశ్ బలగాలు ఈటెతో పొడిచి చంపినట్లు బయటపడటం కలకలం రేపింది. బంగ్లాదేశ్ రెండు నెలల నుంచి ఇలాంటి కవ్వింపు చర్యలకే పాల్పుడుతున్నది.  బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కావాలనే భారత్ పట్ల ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బంగ్లా పౌరులను రెచ్చగొట్టేందుకు అనేక కుట్రలు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్  -పాకిస్థాన్ నావికా దళాలు సన్నిహితంగా మెలుగుతున్నాయి. దీనిలో భాగంగానే నవంబర్‌లో పాకిస్థాన్ నావికాదళ చీఫ్ బంగ్లాదేశ్ మూడు రోజుల పాటు పర్యటించారు. అనంతరం పాకిస్థాన్ ఒక యుద్ధ నౌక బంగ్లాతీరానికి చేరినట్లు తెలిసింది. 1971 తర్వాత తొలిసారిగా పాకిస్థాన్  యుద్ధనౌక బంగ్లాదేశ్‌కు చేరుకోవడం గమనార్హం.

హిందువు సజీవదహనం

బంగ్లాదేశ్‌లోని భాలుకా ప్రాంతం మైమైన్సింగ్ జిల్లా దుబాలియాపారాలో దారుణమైన ఘటన చోటుచేసుకున్నది. దుండగులు దీపూ చంద్రదాస్ అనే హిందువును చెట్టుకు వేలాడదీసి సజీవదాహనం చేశారు. ఈఘటన గురువారం రాత్రి చోటుచేసుకున్నది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దీపూ చంద్రదాస్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, హత్యపై ముమ్మర దర్యాప్తు చేపడుతున్నామని అక్కడి పోలీసులు తెలిపారు.

దీపూ స్థానికంగా ఒక వస్త్ర తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నాడని, కొందరు మూకగా వచ్చి అతడిపై దాడి చేసి హతమార్చారని వెల్లడించారు. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి హత్యపై ఆ వర్గానికి చెందిన స్థానికులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. మరోవైపు దీపూ హత్యను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నిందితులు ఎంతటివారైనా అదుపులోకి తీసుకుని, వారికి కఠినశిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అలాగే హిందూ దేవాలయాలు, మైనారిటీల ఆవాస ప్రాంతాల్లో పహారా ఏర్పాటు చేసింది. 

భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ కీలకమైన అడ్వైజరీ జారీ చేసింది. అక్కడున్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  భారత పౌరులు, విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొవద్దని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ కూడా స్పందించింది.

అక్కడ ఉద్రిక్త పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయని, ఆ దేశంలో వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలపైనా అనిశ్చితి నెలకొందని తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వం తో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నదని పేర్కొంది. ఆ దేశంలో మైనార్టీ వర్గాలపై దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని, వారి సంక్షే మం కోసం కృషి చేస్తున్నామని తెలిపింది. మైనారిటీలు, విద్యావేత్తలు, జర్నలిస్టులపై దాడులు మంచిది కాదని పేర్కొంది.