calender_icon.png 2 May, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలకు పరిశుభ్రమైన తాగునీరును సరఫరా చేయాలి...

01-05-2025 10:42:35 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగేలా చర్యలు చెపట్టాలి..

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..

హనుమకొండ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రతి గ్రామం, ఆవాసాలకు పరిశుభ్రమైన తాగునీరును సరఫరా చేయాలని, అందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(District Collector Praveenya) ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, రాజీవ్ యువ వికాసంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ... గ్రామాలలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన చోట్ల అద్దె ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. జీడబ్ల్యూఎంసి పరిధిలో కూడా తాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. గ్రామాలు, ఆవాసాలలో తాగునీరు సరిగా సప్లై అవుతుందా లేదా అనేది చూడాలన్నారు. నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని, క్లోరినేషన్ సరిగ్గా జరిగే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేసేందుకు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల అంశంపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారులకు వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు వేగంగా చేయాలన్నారు. ఆయా గ్రామాల లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో బేస్మెంట్ దశకు వచ్చిన లబ్ధిదారులకు బిల్లు చెల్లింపు కోసం ఆన్లైన్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంఖ్యను శుక్రవారం రోజున గ్రామాల వారీగా అధికారులు అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ జాబితాను సమర్పించాలన్నారు. ఎంపిక చేసిన గ్రామాలలో లబ్ధిదారుల వివరాలను అందజేస్తే అందుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు.

చేయూత పింఛన్లు, రాజీవ్ యువ వికాసంపై కలెక్టర్ మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక జాబితా ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి కావాలాన్నారు. జాబితా లోని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి రవీందర్, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, మిషన్ భగీరథ ఎస్ఈ మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ  బాలరాజు, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి మురళీధర్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీలత, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ప్రేమకళ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, ఎంపీడీవోలు,ఎంపీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.