07-05-2025 04:53:22 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..
ముత్తారం/కాల్వ శ్రీరాంపూర్ (విజయక్రాంతి): జిల్లాలో యాసంగి పంట కొనుగోలులో, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముత్తారం మండలంలోని ముత్తారం, మచ్చుపేట, పారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్, పెద్దరాత్ పల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరగాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన ధాన్యం స్టాక్ వేచి ఉండకుండా ఎప్పటికప్పుడు కాంటా వేయాలని, ప్రతిరోజు కొనుగోలు కేంద్రాల నుంచి కనీసం 6 నుంచి 8 లారీల వరకు లోడ్ రైస్ మిల్లులకు తరలించాలని, ఎక్కడ హమాలీల, రవాణా వాహనాల కొరత రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ముత్తారంలో జాతీయ రహదారి పనులు పరిశీలన..
ముత్తారం మండల కేంద్రంలో జరుగుతున్న వరంగల్-మంచిర్యాల జాతీయ రహదారి సి.ఎన్.జి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపిడిఓ సురేష్, కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ జగదీష్ రావు, డిప్యూటీ తహసిల్దార్ శంకర్, ఏ.డి.ఏ వ్యవసాయ శాఖ అధికారి అంజని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.