calender_icon.png 17 May, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొనుగోలు వేగవంతం చేయండి

07-05-2025 05:01:10 PM

నిర్మల్ (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. బుధవారం కుంటాల మండలం అందకూర్ గ్రామంలోని పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో టెంట్‌, త్రాగునీరు తదితర వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌... కొనుగోలు ప్రక్రియలో అలసత్వం కారణంగా రెండు లక్షల రూపాయల జరిమానా విధించారు.

సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తక్షణమే తూకం వేసి తరలించాలన్నారు. తేమ శాతం నిబంధనల మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. తగినన్ని గన్ని సంచులు, టార్పాలిన్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అన్ని రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తెలుపాలని కలెక్టర్ రైతులను కోరారు. ప్యాడీ క్లీనింగ్ యంత్రాల ద్వారా ధాన్యాన్ని శుభ్రపరచాలని సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) కిషోర్ కుమార్‌, ఆర్డీవో కోమల్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.