calender_icon.png 26 September, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా స్థాయి సాధికార కమిటీని ఏర్పాటు: కలెక్టర్ ఆదర్శ్ సురభి

26-09-2025 08:51:50 PM

వనపర్తి,(విజయక్రాంతి): విచారణ ఖైదీలుగా ఉండి కోర్టు ద్వారా బెయిలు మంజూరు అయినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా హామీ పత్రం డబ్బులు చెల్లించలేని వారికి మానవతా దృక్పథంతో జైలు నుండి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం   జిల్లా స్థాయి సాధికార కమిటీని  ఏర్పాటు చేసినట్లు  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లాకు సంబంధించిన విచారణ ఖైదీలుగా ఉండి బెయిలు ఇచ్చినప్పటికి  ఆర్థిక స్తోమత లేని కారణంగా  హామీ పత్రం ఇవ్వలేని (5) మంది  ఖైదీల పై జిల్లా స్థాయి సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం జరిగింది.

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనగా మిగిలిన కమిటి సభ్యులు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజనీ, మహబూబ్ నగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ రవి కుమార్ వారి కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా నుండి మొత్తం 32 మంది మహబూబ్ నగర్ జైలు లో విచారణ ఖైదీలు ఉండగా 5 మందికి బెయిలు లభించి హామీ ఇవ్వలేని వారి పై కమిటీ చర్చించింది. ఐదుగురిలో నలుగురు ఖైదీల పై తీవ్రమైన ఆరోపణలు, ఇతర కేసుల్లో పాలుపంచుకొని ఉన్నందున వారికి తప్ప కేవలం నాగమ్మ అనే మహిళా ఖైదీకి హామీ పత్రం ఫీజు మాఫీ చేసి జైలు నుండి విడుదల చేసేందుకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.  ఈ సాధికార కమిటి ప్రతి నెల  విచారణ చేయనున్నట్లు తెలియజేశారు.