09-10-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : కొత్తగూడెం ప్రకాశం మైదానం లో బుధవారం 69 వ ఎస్ జి ఎఫ్ జిల్లా స్థాయి క్రీడలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపోటములు సహజమని విజేతలైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ప్రతి క్రీడాకారుడు క్రీడల ద్వారానే బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏ విధమైన సహాయానికైనా డివైఎస్‌ఓ ద్వారా తనను సంప్రదించాలన్నారు. ఈరోజు ,రేపు నిర్వహించబడే పోటీలలో భాగంగా ఈరోజు అనగా 08 న 17 సంవత్సరాల విభాగంలోని బాలబాలికలకు అదేవిధంగా, 9న 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు.
ఉమ్మడి జిల్లా జట్టుతో కలిపి రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందనీ ఎస్ జి ఎఫ్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ కుమార్ తెలియజేశారు. ఈ పోటీలలో డివైఎస్‌ఓ పరంధామ రెడ్డి, డి సి ఈ బి సెక్రెటరీ నీరజ, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులైన ప్రేమ్ కుమార్, యనమదల వేణుగోపాల్, యుగంధర్, స్టెల్లా, కవిత, వీరన్న, కృష్ణ, పామర్తి శ్రీనివాస్ అంపైర్లు గా వ్యవహరించడం జరిగింది.