calender_icon.png 9 October, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పాలనా అధికారులు రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరచాలి

09-10-2025 12:00:00 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 8 ( విజయక్రాంతి ):  గ్రామ స్థాయిలో గ్రామ పాలన అధికారులు  రెవిన్యూ వ్యవస్థను పటిష్టపరచాలని, నిజాయితీగా, నిబద్ధతతో పారదర్శకంగా పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో  కొత్తగా నియామకం పొందిన గ్రామ పాలన అధికారుల శిక్షణ కార్యక్రమంలో  రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ   మీపై నమ్మకంతో  పరిపాలన అధికారులుగా తిరిగి పోస్టింగ్ ఇవ్వడం   జరిగిందని అన్నారు. గ్రామ పరిపాలన అధికారులు విధుల్లో చేరడం వలన  రెవెన్యూ వ్యవస్థకు  పునర్జీవం వచ్చిందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అన్ని సర్వీసులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజాయితీగా పారదర్శకంగా పనిచేయాలన్నారు. అన్ని సర్వీసులు ప్రజలకు అందించేవి  రెవిన్యూ శాఖ మాత్రమే అన్నారు. 

ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలో ఉన్న చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. భూభారతి చట్టం కొత్తగా వచ్చినందున  క్షుణ్ణంగా చదివి  చట్టంపై అవగాహన  కలిగి ఉండాలని, అంచలంచెలుగా న్యాయం జరగాలన్నారు. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సర్టిఫికెట్లను జారీ చేయవలసిన బాధ్యత మీపై  ఉందన్నారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ  గ్రామ పరిపాలన అధికారులు  తమ విధులు బాధ్యతతో  ఉండి పనిచేయాలన్నారు.

గ్రామ రెవిన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా  చూడాలన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు  ఎలా ఎదుర్కోవాలో అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామ పాలన అధికారులు గ్రామాలలో  కుల, ఆదాయ,నివాస, జన్మస్థల ధ్రువపత్రాలు జారీ చేసే విషయంలో  జాగ్రత్తలు వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, సురేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృత్తిక, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, గ్రామ పాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు.