calender_icon.png 15 November, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిడ్జిల్ తహసిల్దార్ కార్యాలయానికి సుస్తి..!

15-11-2025 05:06:14 PM

పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు

ఇష్టారాజ్యంగా పనులు

రైతులకు తప్పని తిప్పలు

మిడ్జిల్ (విజయక్రాంతి): తహసిల్దార్ కార్యాలయానికి సుస్తి చేకూరింది. పట్టించుకునే నాధుడు లేక మండల ప్రజలు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. వివరాల్లోకెళ్తే మిడ్జిల్ తాహసిల్దార్ కార్యాలయానికి నిత్యం మండలంలోని రైతులకు, వినియోగదారులతో కళకళలాడుతూ ఉండేది. గత సంవత్సరం నుండి తహసిల్దార్, అతని సిబ్బంది మధ్య సఖ్యత లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. భూభారతికి సంబంధించి కేసులు, రేషన్ కార్డులో పేరు తొలగింపు, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, భూమి కొలతలు, ఏ పని చేసుకోవాలన్న ముడుపులు చెల్లించాల్సిందే... లేనిచో పనులు జరగవు. దీనికి తోడు మీసేవ నిర్వాహకుల ఇష్టారాజ్యం ఇన్ని సమస్యలు ఉన్నా జిల్లా ఉన్నతాధికారులు మండలం వైపు కన్నెత్తి చూడకపోవడం మండల ప్రజలకు విస్మయం కలిగిస్తుంది.

కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఒకరిపై ఒకరు చెప్పుకోవడం వల్ల ఏ ఒక్క పని కూడా సక్రమంగా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తహసిల్దార్ ఏకపక్ష నిర్ణయాల వల్ల సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని మండలంలోని రైతులు చర్చించుకుంటున్నారు. ఇలాంటి లోపాలను సరి చేయాల్సిన సంబంధిత అధికారులు పట్టనట్లుగా ఉంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు కూడా పైరవీకారులు డబ్బులు అందిస్తేనే ఇసుక అనుమతులు వస్తున్నాయని రైతులు నేరుగా వెళితే ఇసుక అనుమతులు రావడంలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మిడ్జిల్ తహసిల్దార్ కార్యాలయానికి పట్టిన సుస్తి నుండి కోలుకొనేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై తహసిల్దార్ ను అడగగా ప్రతి విషయంలో పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు.