15-11-2025 05:02:57 PM
మత్స్యశాఖ అభివృద్ధికి సీఎం 123 కోట్లు కేటాయింపు..
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
మిడ్జిల్: మత్స్యకారులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని.. మండలంలోని మత్స్యకారుల అభ్యున్నతికి ఎల్లప్పుడు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని నల్లచెరువులో 60 వేల ఉచిత చేప పిల్లలను మండల నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ముదిరాజ్ బిడ్డను మత్స్య సహకార శాఖకు మంత్రిగా నియమించడం పట్ల అశ్రమి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హయాంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిధులు ఎంత ఖర్చైనా వెనకాడకుండా ముందుకు సాగుతుందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లలు అందక 50 శాతం మాత్రమే చిన్న సైజు చేపల పంపిణీ జరిగిందని గుర్తు చేశారు.
దీనివల్ల మత్స్యకారులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మత్స్యశాఖ అభివృద్ధి కోసం రూ 123 కోట్లను కేటాయించడం ప్రజా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను రుజువు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. 2025-26 సంవత్సరం జడ్చర్ల నియోజకవర్గం లోని 389 చెరువులకు దాదాపుగా 49.53 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని వారు స్పష్టం చేశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో వర్షాలు బాగా కురిసి రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కూడా వర్షాలు బాగా పడి చెరువులు నిండుకుండల ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు గోనెల శ్రీనివాసులు. ఏఎంసీ మార్కెట్ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, టీపీసీసీ సెక్రెటరీ రబ్బాని, తహసిల్దార్ పులి రాజు, ఎంపీడీవో గీతాంజలి, స్థానిక మాజీ ఎంపిటిసి మొహమ్మద్ గౌస్, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మత్స్యకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు