calender_icon.png 20 September, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీ కార్యాలయంలోకి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్

20-09-2025 12:00:00 AM

మండల పరిషత్ కార్యాలయాల్లోకి ఇతర ఆఫీసులు

మేడ్చల్, సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): మేడ్చల్ లోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలోకి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించనున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే మేడ్చల్, షామీర్పేట్ మండల పరిషత్ కార్యాలయాల్లోకి సబ్ రిజిస్టర్ కార్యాలయాలను తరలించనున్నారు. కీసర మండల పరిషత్ కార్యాలయంలోకి జవహర్ నవోదయ పాఠశాలను, ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలోకి మున్సిపల్ కార్యాలయాన్ని  తరలించనున్నారు.

జిల్లాలో గతంలో 61 గ్రామ పంచాయతీలు, ఐదు మండలాలు ఉండేవి. జిల్లాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం మేడ్చల్ ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసింది. పక్కన ఎంపీపీ కార్యాలయం కొనసాగింది.

షామీర్పేట్, కీసర, ఘట్కేసర్ లోనూ ఎంపీపీ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో విలీనం చేసి అర్బన్ జిల్లాగా మార్చింది. దీంతో జిల్లా పరిషత్ భవనం, మండల పరిషత్ భవనాలు ఖాళీ అయ్యాయి. ఈ కార్యాలయాల్లోకి అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించనున్నారు.

మేడ్చల్  తొలగనున్న ఇబ్బందులు...

మేడ్చల్ లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఒకే చోట అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. ఈ భవనం లో కనీస అవసరాలు లేవు. రెండు కార్యాలయాలు ఒకే చోట ఉన్నందున నిత్యం రద్దీ ఉంటుంది. వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తాయి. పార్కింగ్ లేనందున ఇబ్బందులు ఎదురయ్యేది. జాతీయ రహదారి మీద తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడేది.

అర్బన్ జిల్లా మారినప్పటి నుంచి ఈ కార్యాలయాలను జిల్లా మండల పరిషత్ కార్యాలయాల్లోకి తరలించాలని వివిధ పార్టీల నాయకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రెండు విశాలమైన భవనాలు ఉన్నాయి. పార్కింగ్ కు అనువైన స్థలం కూడా ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మండల జిల్లా పరిషత్ కార్యాలయా ల్లోకి తరలించాలని నిర్ణయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.