27-09-2025 12:23:20 AM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులను చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్యవంతమైన మహిళ - శక్తివంతమైన కుటుంబం వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ శిబిరంలో మహిళలకు సంబంధించిన గైనకాలజీ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు.
ఈ సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్ఎన్ఎస్పీఏ శిబిరాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ వైద్య శిబిరాల ద్వారా మహిళలు ఏమైనా రుగ్మతలు ఉంటే ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.మహిళలు శక్తివంతంగా ఉన్నప్పుడు వారి కుటుంబాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయని తెలిపారు.గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని,మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని అన్ని జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. వ్యాక్సిన్ డ్యూలిస్టు ఇచ్చిన అనంతరమే వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ సిస్టం ను కూడా ఆయన పరిశీలించారు.వ్యాక్సిన్ రిజిస్టర్ను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.