27-09-2025 02:04:52 AM
చండీగర్, సెప్టెంబర్ 26: ఆరు దశాబ్దాలకు పైగా భారత రక్షణ రంగానికి ఎనలేని సేవలందించిన మిగ్-21 యుద్ధవిమానాలకు వీడ్కోలు పలికారు. శుక్రవారం చండీగర్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, పలువురు ఐఏఎఫ్ సీనియర్ అధికారులు, పలువురు సైనికుల కుటుంబాలు పాల్గొన్నాయి. పూర్వపు రష్యా (సోవియట్ యూనియన్) నుంచి ఈ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయగా.. అవి ఆరు దశాబ్దాలకు పైగా సేవలందించాయి.
ఈ రకం యుద్ధవిమానాలను మొదట చండీగర్ ఎయిర్‌బేస్‌లోనే ప్రవేశపెట్టారు. మళ్లీ ఇప్పుడు ఇదే ఎయిర్‌బేస్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. ఈ ఆరు దశాబ్దాల్లో జరిగిన ఎన్నో యుద్ధాలు గెలవడంలో ఈ జెట్స్ కీలకపాత్ర పోషించాయి. ఫస్ట్ సూపర్ సోనిక్స్‌గా వ్యవహరించే ఈ యుద్ధ విమానాలను 28వ స్కాడ్రన్‌కు అప్పగించారు. నాడు వింగ్ కమాండర్ దిల్బాన్ సింగ్ నాయకత్వం వహించారు.
మిగ్-21 విమానాలకు చివరిసారిగా వాటర్ సెల్యూట్ చేసి వీటికి సంబంధించిన లాగ్ బుక్‌ను రక్షణశాఖ మంత్రికి ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ అందజేశారు. వీటి సేవలకు గుర్తుగా ప్రత్యేక స్మారక పోస్టల్ కవర్‌ను రిలీజ్ చేశారు. ఈ విమానాల వల్ల దేశం గౌరవం పెరుగుతూ వచ్చిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
ఎగిరే శవపేటికలు
ఈ యుద్ధ విమానాలు ఎన్నో ఆపరేషన్లలో కీలకపాత్ర పోషించినా కానీ వీటికి ‘ఫ్లుయింగ్ కెఫీన్స్’ అనే పేరు ఉంది. గాల్లో ఉండగానే అకస్మాత్తుగా ఇవి కూలిపోవడంతో ఎంతో మంది పైలట్లు మృత్యువాత పడ్డారు. 1965, 71 ఇండియా యుద్ధాల్లో ఈ జెట్స్ ఎంతో ముఖ్యభూమిక పోషించాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో కూడా ఈ జెట్స్ పాల్గొన్నాయి. ఇక ప్రస్తుతం వీటి స్థానంలో తేజస్ జెట్లను రక్షణ శాఖ ఆర్డర్ చేసింది.