01-12-2025 12:16:35 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, నవంబర్ 30 (విజయక్రాంతి) : రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లోకి ముగ్గురి కంటే ఎక్కువ అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆదివారం ఉదయం రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి, కొత్తకోట మదనాపూర్, ఆత్మకూర్, అమర్ చింత మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది.
ఈ నేపథ్యంలో కలెక్టర్ వనపర్తి మండలంలోని రాజపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో, మదనపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో, ఆత్మకూర్ మండల పరిధిలోని పిన్నంచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు.
నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని సూచించారు. అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం టీ పోల్ యాప్ లోఅప్డేట్ చేయాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజర్, మరొకరు లేదా ఇద్దరు మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని సూచించారు. ఆయా మండలాలతహసీల్దార్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.