3 July, 2026 | 9:12 AM

కేసీఆర్‌కు పవర్ షాక్!

12-06-2024 01:29 AM

నోటీసులు జారీచేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్

* విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల 

నిర్మాణంలో అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

* 15 నాటికి సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశం

* జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మొద టి షాక్ తగిలింది. పైగా ఇది ‘పవర్’ షాక్ కావడంతో అందరి దృష్టి విద్యుత్తు శాఖపై జరుగుతున్న విచారణవైపు మళ్ళింది.

విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణాల్లో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా.. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో పేర్కొన్న అంశాలపై సమాధానం ఇవ్వాలని కమిషన్ స్పష్టంగా సూచించింది. జూన్ 15 లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ కోరగా.. జూలై 30 వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ కోరారు.

కేసీఆర్‌కు నోటీసులు

వాస్తవానికి కేసీఆర్‌కు చాలా రోజుల క్రితమే జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో ప్రధానంగా సాగుతున్న నాలుగు స్కాములకు సంబంధించి విచారణలో.. మొదటగా విద్యుత్తుకు సంబంధించిన విచారణలో కీలకమైన పాత్రధారులకు నోటీసులు అందించినట్టుగా చెప్పవచ్చు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇప్పటికే విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించిన కీలకమైన ఫైళ్లు, రికార్డులను స్వాధీనం చేసుకుని అధ్యయనం చేస్తోంది. అలాగే ఇందులో పాత్రధారులకు నోటీసులు ఇచ్చి సమాచారాన్ని రాబడుతున్నారు. వ్యక్తిగతంగానూ పిలిచి విచారిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇవ్వడం గమనార్హం.

మూడు అంశాలపై విచారణ..

విద్యుత్తుకు సంబంధించి మూడు అంశాలపై విచారణ కొనసాగుతుందని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బీఆర్కే భవన్‌లో ఏర్పాటుచేసిన కమిషన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి విచారణ జరుగుతోందని అన్నారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయని, ఇదులో భాగంగా 25 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదని, దానితో జూన్ 15 లోగా సమా ధానం ఇవ్వాలని సూచించామని తెలి పారు. అయితే జూలై 30 వరకు ఆయన గడువు అడిగారని చెప్పారు.

ఇప్పటికే ట్రాన్స్‌కో, జెన్‌కోల మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలతో కమిషన్ సమావేశమయ్యింది. అలాగే మంగళవారం నాడు ఇంధన శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీలు అర్వింద్‌కుమార్, ఎస్కే జోషీలను కమిషన్ విచారించింది. సోమవారం మరో రిటైర్డు ఐఏఎస్ అధికారి సురేష్‌చందా నుంచి కూడా సమాచారాన్ని రాబట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే తాము అమలు చేసినట్టు, తాము సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారు. ఈ మూడు అంశాలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం మాత్రమే నిర్ణయాలు తీసుకుందని, జెన్‌కోతో ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టంగా కమిషన్‌కు వివరించారు. అప్పటి విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్, తాను అప్పుడే  విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదని చెప్పారు. 

ఛత్తీస్‌గఢ్‌కు అధికారం

వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్యన విద్యుత్తు కొనుగోలు ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలి. కానీ ఈ విషయంలో రెండు రాష్ట్రాల ఒప్పందంలో ఛత్తీస్‌గఢ్‌కు అధికారం ఇచ్చారు. భారీగా నిధులు ఖర్చుచేసి విద్యుత్తును కొనుగోలు చేశారు. మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం అనేది తేల్చాల్సి ఉందని కమిషన్ పేర్కొంది. అలాగే భద్రాద్రిలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడాల్సి ఉండగా.. సబ్ క్రిటికల్ సాంకేతికతను వాడారు. ఇక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి.. నామినేషన్ పద్ధతిలో పనులను అప్పగించారు. ఇప్పటికీ అవి పూర్తి కాలేవు. ఆగస్టు వరకు ఒక లైను అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. కానీ రైల్వే లైను వేయలేదు. అధికారుల నుంచే కాదు.. ప్రముఖుల నుంచి కూడా సమాచారాన్ని తీసుకుంటున్నామని జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తెలిపింది. 

వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే..

ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఏప్రిల్‌లోనే నోటీసులు అందించారు. మొత్తం 25 మందికి నోటీసులు అందించినట్టు జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు. అయితే తమ నోటీసులకు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వకపోతే వ్యక్తిగతంగానూ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టంగా పేర్కొంది.