calender_icon.png 23 August, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాచరిక అవశేషాలకు చోటు అవసరమా?

15-06-2024 12:05:00 AM

జూకంటి జగన్నాథం :

రాచరిక పాలనను వారి ముఖ్య నిర్మాణ చిహ్నాలను యాంత్రికంగా రాచరికపు వెలుగులో చూడకుండా ప్రజా సామాజిక ఆర్థిక సంస్కృతుల కోణంలో మారుతున్న స్థల, కాలాల నేపథ్యంలో మరోసారి చారిత్రక సామాజిక పరిశోధకులు, కొత్త కొత్త చరిత్ర ఔత్సాహికులు సరికొత్త పరికరాలతో రాచరిక ఆనవాళ్ల చరిత్రను సమీక్షించుకోవాల్సిన అవశ్యకత ఉంది. చర్చలో అందరి అభిప్రాయాలకు తావుండేలా అన్ని కిటికీలు తెరవడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక లక్షణం.

రాజుల పరిపాలన కాలాన్ని 21వ శతాబ్దం ఉత్తరార్థం వెలుగులో ప్రస్తుత పరిస్థితులలో ఒకసారి అవలోకించాల్సిన అవసరం ఉంది. రాచరిక కోణంలో అర్థం చేసుకోవాలా? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు కొనసాగుతున్న దశలో పాలకుల దృష్టి నుంచి వీక్షించాలా? ఆయా కాల సమయాలలో నివసించిన ప్రజల సామాజిక సంస్కృతి నుంచి అర్థం చేసుకోవాలా? ఇత్యాది ప్రశ్నలు తలెత్తుతాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలను తెలంగాణ మొత్తాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకొని ఆ దిశగా కొన్ని నమూనాలను పరిశీలిస్తున్న దశలో బీఆరెస్ పార్టీ నాయకులు, వారి మద్దతుదారులు కొందరు వ్యతిరేకించడంతో ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం ప్రకటనను మరిన్ని సలహాలు, సూచనల కోసం వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో రాచరికపు అవశేషపు ఆనవాళ్ళ స్వరూప స్వభావాలను మరింత లోతుగా అధ్యయనం చేసి చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాచరికం అంటేనే ఏకచ్ఛత్రాధిపత్యం. ఒకే రాజు నియంత్రణలో తమ ప్రాంతాల్లోని ప్రజలను పరిపాలించడంగా ఉంటుంది. ఇందులో నియంతృత్వానికి, అణచివేతకు, హింసకు, అరాచకత్వానికి తావు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేసిన మంచి పనులు గోరంతయితే తమ శాసనాల ద్వారా కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటారు. అయితే, వీరు నిర్మించిన పేరు గాంచిన చిహ్నాలలో తమ పాలనలోని ప్రజల సంస్కృతి, జీవన విధానాలకు చోటు దక్కిన దాఖలాలు పెద్దగా కనిపించవు. 

ఏది చేసినా, దేన్ని వెలుగెత్తి పట్టినా అందులో వారి ఔన్నత్యం, కీర్తి, ప్రతిష్ఠలకు అతి పెద్ద పీట వేసినట్టు కనిపిస్తుంది. రాజుల పరిపాలన విశేషాలనే ప్రధానంగా ప్రతిబింబిస్తుంది. మరీ ముఖ్యంగా రాచరికపు దృష్టి కోణంలోనే ఎక్కువమంది చరిత్రకారులు చరిత్రను నమోదు చేశారు తప్ప ప్రజల ధృక్కోణంలో చరిత్రను  లిఖించిన ఉదాహరణలు అరుదుగా కనిపిస్తాయి. రాజు క్షేమమే ప్రజల సంక్షేమంగా రాచరిక పాలన ముమ్మూర్తులా సహజంగా కొనసాగుతుంది. రాజు కొలువులో ముఖ్య సలహాదారుగా ప్రధాన మంత్రిగా బ్రాహ్మణవాదులు కొనసాగారు. కాబట్టి, మిగతా సమాజానికి ప్రాతినిధ్యం కానీ, ప్రజల అభిప్రాయాలకు, మర్యాదలకు కానీ వీరి పాలనలో పెద్దగా స్థానం, స్థలం ఉండేది కాదు.

రాచరిక కాలాలను, చిహ్నాలను ప్రజా దృక్పథంతో చూడాల్సి ఉంది. ఒకవేళ ప్రజల  జీవన విధానాలు, సంస్కృతులను చరిత్రకారులు చూసే ప్రయత్నం చేసినా అది పాలకుల గుర్తింపు పొందలేక సాచివేతకు గురి అయింది. అందులో భాగంగానే కాకతీయుల నిర్మాణాలను కానీ, నిజాం ప్రభువుల కట్టడాలను, రాచరిక కార్యకలాపాలను కానీ వివేచనతో బేరీజు వేసుకొని సమీక్షించుకోవాల్సిన  పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి విశేష నిర్మితాలు సర్వకాలీనం, సార్వజనీనం ఆమోదం కానేరవు. భారత స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అశోక చక్రవర్తి సారనాథ్ స్తంభం నుండి అశోక చక్రాన్ని రాజముద్రగా 1950 జనవరి 26 స్వీకరించారు.

అశోకుని కాలంలోని అశోక స్తంభం గాని, సారనాథ స్తంభంపైని చిహ్నం గాని నాటి ప్రజల సంస్కృతికి దర్పణం పడుతుంది. మొగలాయిల కాలంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన  కట్టడాలను అప్పుడు పరిగణలోకి తీసుకోక పోవడాన్ని మనం గమనించాలి. ఇకపోతే కాకతీయులు క్రీస్తుశకం 750 సంవత్సరం నుండి 1323 వరకు తెలుగు సువిశాల ప్రాంతాన్ని పరిపాలించారు. అంతకు ముందు వీరి రాజ్యంలో ఉన్న జైన దేవాలయాలు అన్నిటినీ క్రమక్రమంగా శైవ దేవాలయాలుగా మార్చారు. వీరి కాలంలో తీవ్ర కరువు కాటకాలు ఏర్పడడం వల్ల చెరువులు, తటాకాలు  తవ్వించారు.

తద్వారా వ్యవసాయం అభివృద్ధి చెంది రైతుల నుండి శిస్తులను వసూలు చేశారు. అందులో భాగంగానే సమ్మక్క, సారక్క ఆదివాసీ వీర వనితలను క్రూరంగా అణచి వేశారు. తమ విజయానికి సంకేతంగా అనేక శిలా శాసనాలను వేయించారు కూడా. వీరి కాలంలో శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా శిలా తోరణాన్ని నిర్మించారు. కానీ, ఈ కట్టడాల వెనుక, చెరువుల నిర్మాణాల వెనుక ప్రజల మూలుగులు ఎక్కడా చరిత్రలో కనిపించవు. అందులో ప్రజల సంస్కృతికి ఏ మాత్రం అవకాశం ఉండాలనుకోవడం అత్యాశ అవుతుంది.

అనంతరం దక్కన్ పీఠభూభాగాన్ని నిజాం చక్రవర్తులు క్రీస్తుశకం 1724 నుండి 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏలారు. ముఖ్యంగా 431 సంవత్సరాలు చార్మినార్ నాలుగో అంతస్తు మజీద్‌గా కొనసాగింది. దీన్ని పవిత్ర సంవత్సరం 1591లో ప్రారంభించారు. వీరి పాలనలో ముఖ్యంగా జాగీర్దారులు, జమీందారులు, తాబేదారు,్ల దొరలు తమ తమ ప్రాంతాలలోని ప్రజలను తీవ్రంగా అణచివేసి హింసించి, వారి ముక్కు పిండి పన్నులను వసూలు చేసి నిజాం ఖజానాకు కొంత మొత్తం జమ చేసేవారు. వీరి కాలంలో కొనసాగిన ఆగడాలు ఇంతా అంతా కాదు.

తెలుగు మాట్లాడుకునే మెజారిటీ ప్రజలపై ఉర్దూ భాషను తప్పనిసరి చేశారు. ఈ కాలంలో కూడా నిర్మాణాలన్నిటిలో తెలుగు ప్రజల జీవన సామాజిక సంస్కృతులకు ఈషణ్మాత్రం చోటు దక్కలేదు. ఏ చక్రవర్తి కాలంలో ఆ చక్రవర్తుల ఆచార వ్యవహారాలను మతాన్ని, వారి సంస్కృతే గొప్పదనే ప్రచారం చేశారు. వీరి కాలంలోనే కొమురం భీం ఆదివాసీ పోరాటాన్ని అణచివేశారు. మొన్న మొన్నటి వరకు నిర్మల్ దగ్గర 1000 ఉరుల మర్రి ఉండేది. కానీ, నిజాం దాన్ని రక్షించడానికి తగు చర్యలు తీసుకోలేక పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాజముద్ర (ఎంబ్లమ్)లో ప్రజా సంస్కృతిని పూర్తిస్థాయిలో ప్రతిబించాలని మార్పులు, చేర్పులు చేయడానికి పూనుకుంది. పాత వాసనలు ఉన్న సాంప్రదాయ బ్రాహ్మణ్య వాదులు, గత ప్రభుత్వాన్ని పల్లకిలో మోసిన మేధావులు ఈ  మార్పులు, చేర్పులపైన విమర్శలు చేయడమే కాకుండా తమ ఆధీనంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పనిచేస్తున్న అన్ని రకాల మీడియాల ద్వారా ప్రజా సమూహాలలో వ్యతిరేకతను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో రాచరికపు ఆనవాళ్లను గాక ప్రజల సంస్కృతికి భాగస్వామ్యం ఉండేలా చూడాలనుకోవడం పెద్దగా అపచారం జరిగినట్టు అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

రాచరిక పాలనను వారి ముఖ్య నిర్మాణ చిహ్నాలను యాంత్రికంగా రాచరికపు వెలుగులో చూడకుండా ప్రజా సామాజిక ఆర్థిక సంస్కృతుల కోణంలో మారుతున్న స్థల, కాలాల నేపథ్యంలో మరోసారి చారిత్రక సామాజిక పరిశోధకులు, కొత్త కొత్త చరిత్ర ఔత్సాహికులు సరికొత్త పరికరాలతో రాచరిక ఆనవాళ్ల చరిత్రను సమీక్షించుకోవా ల్సిన అవశ్యకత ఉంది. చర్చలో అందరి అభిప్రాయాలకు తావుండేలా అన్ని కిటికీలు తెరవడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక లక్షణం. బలవంతంగా ప్రజలపై రుద్దడం అప్రజాస్వామిక నియంతృత్వ పోకడలకు నిదర్శనం.

వ్యాసకర్త ప్రసిద్ధ కవి, రచయిత