16-06-2024 12:05:00 AM
దేశంలోని బొగ్గు గనుల గుహలలోకి పని చేయడానికి ప్రాణభయంతో ఎవ్వరు కూడా ముందుకు రాని పరిస్థితులలో తమ బతుకు తెరువుకోసం, దేశానికి ఇంధనం, విద్యుత్తు అందించడానికి త్యాగంతో సర్వశక్తులు ధారపోస్తూ, తమ శక్తి ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసికూడా బొగ్గు పరిశ్రమలలో ఉద్యోగం చేసి, రిటైరైన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యుత్ కాంతులవలే తమ బతుకు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు వైభవంగా ఉంటుందని, రిటైరైన తర్వాత దివ్యంగా వెలిగిపోతుందనీ ఆశించారు. కానీ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రస్తుత పరిస్థితి కాలిపోయిన బొగ్గు బూడిద, మూసి వేసిన బొగ్గు గనులు, మాడిపోయిన ఎలక్ట్రికల్ బుగ్గలు, తుప్పు పట్టిన ఇనుము వలె ఉంటున్నది.
ఎప్పుడో 1998లో రూపొందించిన పెన్షన్ పథకం ద్వారా ఉద్యోగ విరమణ చేసిన చివరి నెల జీతంపై 25% పెన్షన్ ఇస్తున్నారు. దీని ప్రకారం దాదాపు లక్షలమంది పైగా రూపాయలు 2000 లోపు మాత్రమే పెన్షన్ ఇప్పటికీ పొందుతున్నారు. వివిధ రాష్ట్రాలలో సంక్షేమ పెన్షన్లు దాదాపు రూ.4,000 ఇస్తున్నారు 30- సంవత్సరాలు పని చేసిన బొగ్గు ఉద్యోగులు అత్యంత తక్కువ పెన్షన్ పొందడం దారుణం. అసలు బొగ్గు గనులలో ఎందుకు ఉద్యోగం చేశామా అని వాపోతున్నారు. దాదాపు ప్రతి రంగంలో మొదటగా నిర్ణయించిన పథకాలు నియమ నిబంధనలు అప్పటి అవసరాలనుబట్టి సవరిస్తున్నారు. కానీ, దురదృష్టమేమో బొగ్గు గనుల పెన్షన్ పథకాన్ని పాతికేళ్లు గడిచినా నేటికీ సవరించి, పెంచలేదు. బొగ్గు కార్యదర్శి, కోల్ ఇండియా చైర్మన్ సీఎంపిఫ్ కమిషనర్ కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, ‘ఇదొక సమస్య కానట్టు’ ప్రవర్తించడం అన్యాయం.
మా పింఛను పెంచమని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అప్పటి బొగ్గు గనుల శాఖ మంత్రితో సహా అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. ఫలితం గోడకు వేసిన సున్నమే. కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్‌కత్తా, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ ధన్భాద్, వారణాసి, నాగపూర్, సీఎంపిఎఫ్ ప్రాంతీయ కార్యాలయల వద్ద పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించినా చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లు ఉంటున్నది. ఈ విషయమై నాయకులు, అధికారులు శ్రద్ధ చిత్తశుద్ధి కనబరచడం లేదు. మా దీనస్థితిని అర్థం చేసుకుని మొట్టమొదటిసారిగా క్యాబినెట్ హోదాతో బొగ్గు గనుల శాఖమంత్రిగా నియమితులైన గంగాపురం కిషన్‌రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సత్వరమే చర్చించి న్యాయం జరిగేలా చూడాలి.
దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్
సింగరేణిభవన్, హైదరాబాద్