06-11-2025 12:02:22 AM
సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటు
జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరున అవినీ తికి పాల్పడిన కేసీఆర్‌ను జైలులో వేసే దమ్ము బీజేపీ ఉందా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం స్కాంపై సీబీఐ విచారణ కోరితే మోదీ ఎందుకు పట్టించుకో వడంలేదని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున బుధవారం యూసుఫ్‌గూడ, వెంకటగిరి వాటర్ ట్యాంకు నుంచి రోడ్ షో ప్రారంభించి, షేక్‌పేట పారామౌంట్ కాలనీలో జరిగిన సభలో సీఎం మాట్లాడారు.
అంతకు ముందు షేక్‌పేట సాయిబాబా గుడిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో ఒకవైపు కేసీఆర్, మోదీ ఉంటే.. మరోవైపు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, అసదుద్దీన్ ఉన్నారు అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన కేసీర్‌పై సీబీఐ విచారణకు ఆదేశిస్తే, 24 గంటల్లో చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని కిషన్‌రెడ్డి అన్నారని,
విచారణకు ఆదేశించి మూడు నెలలైనా మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫార్ములా -ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరితే రెండు నెలలుగా ఫైలును తొక్కిపెట్టారని, దీని వెనుక ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సెంటిమెంట్ కాదు.. డెవలప్‌మెంట్ కావాలి
సెంటిమెంట్ పేరుతో ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత నేత పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదంటూ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని అవమానించాడని పేర్కొన్నారు. ఇప్పుడు బెంజ్ కారులు వదిలి ఆటోలో తిరుగుతూ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే జూబ్లీహిల్స్‌లో రూ.400 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టిందని, 2 లక్షల 39 వేల మందికి సన్న బియ్యం అందిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అంటేనే ముస్లిం
కొందరు తన మాటలను వక్రీకరిస్తున్నారని, తాను మొదటినుంచీ లౌకికవాదినని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు. అజారుద్దీన్‌ను మంత్రిని చేస్తే కిషన్‌రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. సిరాజ్, నిఖత్ జరీన్లకు డీఎస్పీ పదవులు ఇచ్చి మైనారిటీలకు సముచిత గౌరవం ఇచ్చామని గుర్తుచేశారు. ఎంఐఎం నేతలు సైతం నవీన్‌యాదవ్ గెలుపు కోసం కష్టపడుతున్నారని, ఆయన 30 వేల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు
సవాళ్లు విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని, గతంలో తాను విసిరిన వైట్ ఛాలెంజ్‌కు రాకుండా పారిపోయాడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కంటోన్మెంట్‌లో రూ.4 వేల కోట్ల పనులు జరగలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరాడని, ఎమ్మెల్యే శ్రీ గణేష్ రూ.5 వేల కోట్ల జీవోలు చూపిస్తే కేటీఆర్ పారిపోయాడని పేర్కొన్నారు. ఇప్పుడు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి అని సవాల్ విసిరారు.
బీజేపీకి బీఆర్‌ఎస్ తాకట్టు
బీఆర్‌ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి ఎన్నడో తాకట్టు పెట్టిండని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిం దని సీఎం సెటైర్లు వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సం ఘాల ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు తాను కృషి చేస్తామని క్రైస్తవులు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరమని, పొరపాటున కారు గుర్తుకే ఓటేస్తే అది కమలం గుర్తుకు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. మైనార్టీలను మభ్య పెట్టేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించి 3 నెలులు గడుస్తోందని, అయినా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య రాజకీ య ఒప్పందం లేకపోతే కేటీఆర్‌పై వి చారణకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.