16-05-2025 01:43:13 AM
ఉగ్రశిబిరాలు ఎక్కడున్నా నాశనం చేస్తాం
బాదామిబాగ్ కంటోన్మెంట్ సందర్శించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్
శ్రీనగర్, మే 15: ‘బాధ్యతారాహిత్యంగా ఉండే దుష్టదేశం పాకిస్థాన్ (రోగ్ నేషన్) వద్ద అణ్వాయుధాలు ఉండటం ఎంత వరకు సబబు.? ’ అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ దేశాలను ప్రశ్నించారు. గురువారం శ్రీనగర్‌లోని బాదామి బాగ్ కంటోన్మెంట్‌ను సందర్శించిన మంత్రి అక్కడి సైనికులతో ముచ్చటించారు. ఆపరేషన్ సిం దూర్ విజయంపై వారిని అభినం దించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాక్ తీరును ఎండగట్టారు. ‘బాధ్యత లేని పాక్ వద్ద అణ్వాయుధాలు ఉండటం సరైందేనా.? ఉగ్రశిబిరాలు ఎక్కడ ఉన్నా నాశనం చేస్తాం. టెర్రరిస్టులతో పోరులో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నా. ఆపరేషన్ సిందూర్ ఒక కమిట్‌మెంట్. ఇక మీదట భారత్‌పై జరిగే ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. మన సైనికుల సత్తా ప్రపంచానికి తెలుసు.
వారు లక్ష్యం ఎటువంటిదైనా వదిలిపెట్టరు. ఉగ్రవాదంపై భారత్ ఉధృతంగా పోరాడుతోంది. పాకిస్థాన్ భారతదేశాన్ని ఎంతలా బెదిరిస్తోందో ప్రపంచం మొత్తం చూస్తోంది. పాకిస్థాన్ అణ్వాయుధాలను స్వాధీనం చేసుకుని పర్యవేక్షించాలని నేను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)ను కోరుతున్నా.’ అని పేర్కొన్నారు. పాక్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రి సందర్శించారు.
మంగళవారం ప్రధాని మోదీ ఆదం పూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన తర్వాత గురువారం రక్షణ మంత్రి బాదామిబాగ్ కంటోన్మెంట్‌ను సందర్శించారు. “భారత్ మాతా కీ జై” అనే నినాదం తో మంత్రి తన ప్రసంగం మొదలుపెట్టారు. అంతకు ముందు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మంత్రికి స్వాగతం పలికారు.