మరీ అంత స్పీడొద్దు.. హరీశ్

27-04-2024 01:31:06 AM

l ఆగస్టు 15తర్వాత రాజీనామాతో స్పీకర్ వద్దకు రండి 

l బీఆర్‌ఎస్ బెదిరింపులకు భయపడే రోజులు పోయాయి

l రాజకీయ నాయకులు కేసీఆర్ వల్లే కొత్త భాష నేర్చుకున్నారు

l వేదపండితులు వద్దన్నా మోదీ ఒంటరిగా బాలరామున్ని ప్రతిష్టించారు..

l సిద్దిపేటలో ఎన్నికల ప్రచార సభలో మంత్రి కొండా సురేఖ

సిద్దిపేట, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తారని, అప్పుడే అంత స్పీడ్ వద్దు అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావుకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆగస్టు 15తర్వాత రాజీనామా పత్రాన్ని తీసుకుని స్పీకర్ వద్దకు రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం సిద్దిపేటలో మెదక్ లోక్‌సభ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన రోడ్‌షో, ప్రచార సభలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి భయపడే రోజులు పోయాయని, సిద్దిపేటలో హరీశ్‌రావు ఎంత భయపెట్టినా కాంగ్రెస్ నాయకులు భయపడరని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, అదే విశ్వాసంతో ప్రజలు గెలిపించా రన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖాళీ చిప్ప చేతికిచ్చి వెళ్లిందని, ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేసే దుస్థితి తీసుకువచ్చారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో మార్పు చాలా వచ్చిందన్నారు. మూడు నెలల్లోనే హామీలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదన్నారు. బీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని, కేసీఆర్ కూతురు లిక్కర్ కేసులో జైలుకెళ్లిందని, కేసీఆర్‌ది ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చిందని త్వరలో ఆయన, కేటీఆర్ జైలుకు పోతారన్నారు. కేటీఆర్ తనపై పరువునష్టం దావా కేసు వేశారని, రాజకీయ నాయకులకు అలాంటి భాషను అలవాటు చేసిందే కేసీఆర్ అని దుయ్యబట్టారు. కేసీఆర్ మాట్లాడిన భాషలోనే రేవంత్‌రెడ్డి సమాధానం ఇస్తున్నారని చెప్పారు. 

బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే.. 

బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను బీజేపీలోకి పంపి ఓటుబ్యాంకు పెంచి బీజేపీ గెలిచేలా ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఇద్దరూ ఒక్కటేనన్నారు. బీజేపీ వస్తే కవితను విడుదల చేసుకోవచ్చని చూస్తున్నారన్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఫోన్‌ట్యాపింగ్‌లాగే ఒక్కొక్కటీ బయటకు వస్తాయన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రం లో ఉండి దేశానికి చేసిన పదేండ్ల మోసం, నయవంచనపై కాంగ్రెస్ రిపోర్టు తయారు చేసిందని, దీన్ని ప్రతీ ఇంటికి పంపిణీ చేస్తామన్నారు. మెదక్ ఎంపీ సీటు ఇచ్చి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసుకునేలా అందరూ శ్రమిస్తే పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. హరీశ్‌రావు ఆన్యాయా లను తట్టుకుని కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటలో పార్టీని కొనసాగించడం ఎంతో అభినందనీయమన్నారు.

కొందరు యూట్యూబ్ ఛానళ్లలతో మీడియా పరువుతీస్తున్నారని, ఎన్నికల తర్వాత వారి పనిపడతామని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. దొరల పాలనలో తెలంగాణ దారుణంగా తయారైందన్నారు. ప్రజలు తిరిగి కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావునే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అసైన్‌మెంట్ భూములకు పట్టా పాసుపుస్తకాలు ఇప్పించారని, వక్ఫ్‌బోర్డు 55 వేల ఎకరాలకు ఎల్‌వోసిలు అందించారని ఆరోపించారు. బీసీ బిడ్డ నీలం మధును గెలిపించి బీఆర్‌ఎస్, బీజేపీలకు గట్టిబుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

సిద్దిపేట ప్రజలకు స్వేచ్ఛ..

సిద్దిపేట ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, ప్రజలను భయపెట్టే వారు లేరని, కాంగ్రెస్ పార్టీకి ధైర్యంగా ఓటు వేయొచ్చని మంత్రి కొండా సురేఖ అన్నారు. 6 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే లేని లోటు తీర్చుకోవాలంటే నీలం మధును  ఎంపీగా గెలిపించు కోవాలని పిలుపునిచ్చారు. భారీగా జనసమీకరణ, బైక్ ర్యాలీ నిర్వహించడం ఎంతో గొప్పగా ఉందని, దీంతో నీలంమధు గెలుపు ఖాయమైందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. వేదపండితులు ఎంత చెప్పినా వినకుండా సీత లేకుండా బాలరామున్ని మాత్రమే మోదీ ప్రతిష్టించారని, ఆయన బ్రహ్మచారి కాబట్టే అలా చేశారంటూ ఆరోపించారు.