హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌లో ఓ జీతగాడు

27-04-2024 01:32:12 AM

l హరీశ్ రాకతో అమరుల స్థూపం ప్రాంతం మైల పడింది

l ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

l అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌లో ఓ జీతగాడు మాత్రమేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. అమరుల చావుకు హరీశ్‌రావు కారణమని ఆరోపించారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీశ్‌రావు అని, అలాంటి వ్యక్తి అమరుల స్థూపం వద్దకు రావడంతో ఆ ప్రాంతం మైలపడిందని, అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15లోగా ఏక కాలంలో రైతు రుణాఫీ చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమ ంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు రాజీనామా లేఖను అమర వీరుల స్థూపం వద్ద శుక్రవారం ఉంచారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న వెంకట్ అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్‌రావుకు, బీఆర్‌ఎస్ నాయకులకు గత పదేళ్లుగా అమరవీరుల స్థూపం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఆయన రాజకీయం వృథా కానివ్వమని మాటిచ్చినట్టుగా ఆగష్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని వెంకట్ స్పష్టం చేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ చెప్పినట్లుగా బీఆర్‌ఎస్ పార్టీని రద్దు చేస్తారో లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.