11-01-2026 12:00:00 AM
బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
ముషీరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): పాలమూరు రైతులకు అన్యాయం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పాలమూరు ప్రజా ప్రతినిధులకు బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డా. రాచాల యుగంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. పాలమూరును పండబెట్టి, డిండికి అంత ఆత్రుత ఎందుకని, నల్గొండ మంత్రులకు వున్న ధ్యాస పాలమూరు మంత్రులకు లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం వారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతలకు జూరాల నుంచి నీటిని నింపి ఉంటే సమస్య ఉండేది కాదని, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొదట రోజుకు 2 టిఎంసీలు తోడాలని, ఆ తరవాత రోజుకు 1.5 టిఎంసీలు తోడాలని ప్రాజెక్టు పనులు ప్రారంభించారన్నారు.
2023లో ఎలక్షన్ స్టంట్ కోసం అప్పటి సీఎం కేసీఆర్ రిజర్వాయర్లు పూర్తి కాకముందే నీళ్లు అప్పటిక ప్పుడు నింపుతున్నట్లు ఆగమేఘాల మీద ప్రాజెక్టును ఓపెన్ చేసి జనాలను పిచ్చోళ్లను చేశారని విమర్శించారు. పాలమూరు రైతుల పక్షాన బీసీ పొలిటికల్ జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నేతలు గోటూరి రవీందర్ గౌడ్, రేనట్ల మల్లేష్, సయ్యద్ గూడుషా, రాఘవేందర్ గౌడ్, యశ్వంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.