calender_icon.png 10 July, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితాన్ని చీకట్లో మగ్గించవద్దు

27-06-2025 01:54:57 AM

కలెక్టర్ పమేలా సత్పతి

 కరీంనగర్, జూన్ 26 (విజయ క్రాంతి): మత్తు పదార్థాలకు బానిసలు మారి జీవితాన్ని చీకటి గదిలో ముగించవద్దని, యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య, ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న కొంతమంది విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడడం బాధాకరమని అన్నారు. కష్టపడి చదివి, ఎంతోమందితో పోటీపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, మంచి భవిష్యత్తు ఉన్న అలాంటి విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడటం శోచనీయమని అన్నారు. జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు వస్తాయని, ప్రతి సమస్యకు పరిష్కార మార్గం కూడా ఉంటుందని అన్నారు.

డ్రగ్స్ బారిన పడటం వారి జీవితాన్ని మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఒకసారి మత్తు బారిన పడినవారు బయటపడడం తేలికైన విషయం కాదని, జీవితాన్ని నాశనం చేసే వరకు వదలదని అన్నారు. చెడు వ్యసనాలను, చెడు మార్గాలు చూపే స్నేహితులను తక్షణమే వదిలేయాలని సూచించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిరోధానికి డ్రగ్ డిటెక్షన్ కిట్లను ఉపయోగించి తనిఖీలు చేస్తున్నామని అన్నారు. డక్స్ తీసుకున్నట్టు తెలిస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు.

అనంతరం డ్రగ్స్ నిరోధానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ నిరోధంపై నిర్వహించిన పెయింటింగ్స్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. డ్రగ్స్ నిర్మూలన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సి.డబ్ల్యూసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డివైఎస్‌ఓ శ్రీనివాస్ గౌడ్, ఎన్. వై. కే కోఆర్డినేటర్ రాంబాబు, వైస్ ప్రిన్సిపల్ చేతన్ శర్మ, నషా ముక్త్ భారత్ కమిటీ మెంబర్ కేశవరెడ్డి, సూపరింటెండెంట్ వీరారెడ్డిపాల్గొన్నారు.