22-09-2024 01:11:46 AM
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రం లో గజం ప్రభుత్వ భూమి కూడా కబ్జాకు గురి కావొద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రకటించారు. రెవెన్యూ అధికారులు నీతి, నిజాయితీగా విధులు నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ శాఖలోని ఐదు ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని, ప్రభుత్వ భూములను కాపాడేందుకు న్యాయపరంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో సరైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి సచివాలయంలోని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
సామాన్య ప్రజలకు మేలు జరిగేలా అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. రెవెన్యూ ఉద్యోగల పనితీరు మరింత మెరుగు పడాలని, పాత వాసనలు ఏమైనా ఉంటే పక్కకు పెట్టాలని సూచించారు. గత ప్రభుత్వం తగిన ప్రత్యామ్నాయాలు సూచించకుండా వీఆర్‌వో, వీఏఏ వ్యవస్థను రద్దు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయిందని, ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండేలా తమ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తుందని తెలిపారు.
మంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలు
మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం
తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పిన మంత్రి, తమకు ఎవరిమీద వ్యక్తిగత కోపాలు లేవని అన్నారు. రెవెన్యూ యంత్రాంగం సానుకూల దృక్పథంతో పనిచేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని నింపాలని కోరారు. ప్రభుత్వానికి రావలసిన ప్రతి రూపాయి వసూలు కావాల్సిందేనని, అలాగే గజం భూమి కూడా కబ్జాకు గురి కావొద్దని స్పష్టంచేశారు. శాఖా పరమైన ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 29వ తేదీన ఎమ్మార్వో స్థాయి అధికారులతో, అక్టోబర్ 6వ తేదీన ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వీఆర్‌వో, వీఆర్‌ఏలతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, ట్రెసా, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ వీఆర్వో అసోసియేషన్, తెలంగాణ వీఆర్‌ఏ హక్కుల సాధన సమితి, తెలంగాణ రీడిప్లాయిడ్ వీఆర్వో అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.