09-11-2025 01:12:18 AM
వారు పిల్లలకు పిస్టల్స్ ఇస్తున్నారు.. మేం ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నాం
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ
సితామర్హి, నవంబర్ 8: ఆర్జేడీ యువతను గూండాలుగా మార్చేందుకు ప్రయ త్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘వారు పిల్లలకు పిస్టల్స్ ఇస్తున్నారు.. మేము ల్యాప్ టాప్‌లు ఇస్తున్నాం’ అని తెలిపారు. జంగిల్ రాజ్ అంటే ‘పిస్టల్స్, క్రూరత్వం, అవినీతి, శత్రుత్వం’ అని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బీహార్‌లోని సితామర్హిలో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగిస్తూ ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష పార్టీ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్ర యువతను గూండాలుగా మార్చడానికి వారు ప్రయత్నిస్తున్నా రని ఆరోపించారు. ఎన్‌డీఏ యువ తరానికి కంప్యూటర్లు, క్రీడా సామగ్రిని అందిస్తుండగా, ఆర్జేడీ వారికి పిస్ట ల్స్ ఇవ్వడం గురించి మాట్లాడుతోందని పేర్కొన్నారు. ఆ నాయకులు తమ సొంత పిల్లలను ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎం పీలు, ఎమ్మెల్యేలను చేయాలనుకుంటున్నా రు, కానీ ‘మీ పిల్లలను మాత్రం గూండాలను చేయాలని’ వారు అనుకుంటున్నారని ప్రజలకు వివరించారు.
బీహార్ దీన్ని ఎప్పటికీ అంగీకరించదు. జంగిల్ రాజ్ అంటే ‘పిస్టల్స్, క్రూరత్వం, అవినీతి, శత్రుత్వం’అని మోదీ అన్నారు. బీహార్ పిల్లల కోసం ఆర్జేడీ ఏమి చేయాలనుకుంటుందో వారి నాయకుల ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపి స్తుంది. ఆర్జేడీ వేదికలపై అమాయక పిల్లలను ‘మేము గ్యాంగ్‌స్టర్లు అవుతాం’ అని చెప్పమని బలవంతం చేస్తోందని ఆరోపించారు. అడవి రాజ్ వచ్చిన వెంటనే, బీహార్ పతన యుగం ప్రారంభమైంది.
ఆర్జేడీ బీహార్‌లో అభివృద్ధిని మొత్తం అంతం చేసింద న్నారు. వారి నుంచి ఏదైనా అభివృద్ధి ఆసిస్తే అవి పెద్ద అబద్ధాలే నని తెలిపారు. నేటి బీహార్‌లో ‘చేతులు పైకెత్తు’ అని చెప్పే వారికి చోటు లేదు. బీహార్‌కు ఇప్పుడు కావాల్సింది స్టార్టప్‌ల కలలు కనేవారు అని ఆయన ప్రకటించారు. నై చాహియే కట్టా సర్కార్, ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్ (మాకు తుపాకీ పట్టుకునే ప్రభుత్వం వద్దు, ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి) అనే కొత్త నినాదాన్ని ప్రవేశపెట్టారు. బీహీర్ మొదటి దశ ఎన్నికల్లో జరి గిన అధిక పోలింగ్‌పై ప్రధాని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఓటర్లను ఉద్దేశిస్తూ ‘మీరు ప్రతిపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారు. వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు’ అని అన్నారు. అధిక పోలింగ్ శాతం ఎన్డీఏకు అఖండ మద్దతును సూచిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్‌లో దాదాపు డజను ర్యాలీలు నిర్వహించిన ప్రధాని మోదీ, ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాను పునరుద్ఘాటించారు. కూటమికి మద్ద తు ఇవ్వాలని ఓటర్లను కోరారు. బీహార్ ఎన్నికలు రెండో, చివరి దశ నవంబర్ 11న జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెలువడే అవకాశం ఉంది.
వారు మునిగేందుకు ప్రాక్టీస్
బీహార్ చేపలను చూసేందుకు పెద్దపెద్ద నేతలు వస్తున్నారని, ఎన్నికల్లో మునిగిపోయేందుకు ఇప్పటి నుంచే వారు ప్రాక్టీస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల చేపలను పట్టేందుకు చెరువులోకి దిగిన విషయం తెలిసిందే. ఈ చేపల వేటగాళ్లను ఉద్దేశించి మోదీ వ్యంగ్యాస్త్రాలను సంధిం చారు.