calender_icon.png 9 November, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీర వనితలకు సలాం!

09-11-2025 01:15:41 AM

మన అమ్మాయిలు వన్డే ప్రపంచకప్ సాధించడం ద్వారా దాదాపు ఐదు దశాబ్దాల కల నెరవేరిన వేళ.. యావత్ భారతావని పులకరించిపోయింది. ఒక స్వప్నం సాకారమైందన్న కొండంత తృప్తి. అంతకుమించి గుండెల నిండుగా ఉప్పొంగే మాటలకందని ఆనందం. భారత మహిళల క్రికెట్ పరంగా ఇది మరో కొత్త చరిత్ర. తొలిసారి కపిల్ సేన 1983లో ప్రపంచకప్ కొట్టినప్పుడు ముందు, ఆ తర్వాత అని భారత క్రికెట్‌ను నిర్వచించినట్లుగానే ఇక మహిళల క్రికెట్‌లోనూ సరికొత్త అధ్యాయం మొదలైనట్లే. ఒకప్పుడు మ్యాచ్‌లు ఆడేందుకు చందాలు వేసుకొని ప్రయాణం చేసిన మన అమ్మాయిలు ఇవాళ పరుషులతో సమానంగా వేతనాలు, బిజినెస్ క్లాసులో ప్రయాణాలు చేసే గొప్ప స్థాయికి ఎదిగారు. ఈ సందర్భంగా వీర వనితలకు సలాం చెప్పకుండా ఉండలేం!

భారత క్రికెట్‌లో మరో సువర్ణాధ్యాయం మొదలైంది. క్రికెట్‌లో మేజర్ టోర్నీగా పిలిచే వన్డే ప్రపంచకప్‌ను సాధించిన అమ్మాయిల బృందం కొత్త చరిత్ర సృష్టించింది.  ఆదివారం జరిగిన పైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టి కరిపించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. దాదాపు 47 ఏళ్ల క్రితం అంటే 1978లో మొదలైన మహిళల క్రికెట్‌లో భారత ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగింది. ఎన్నో అవమానాలు, మరెన్నో చీదరింపులు దాటుకొని ఇవాళ దేశం గర్వపడే ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్ సేన విజయంతో మెరిసింది.

పురుషుల క్రికెట్‌కు తామేమీ తీసిపోమని దిక్కుల పెక్కటిల్లేలా గర్జించిన మన వీర వనితలు ఇవాళ ప్రపంచకప్ అందుకోవడానికి అన్ని అరతలు సాధించారు. భారత్ క్రికెట్‌లో 1983కు ముందు.. ఆ తర్వాత అనేంతలా కపిల్ డెవిల్స్ వన్డే ప్రపంచకప్ సాధించి క్రికెట్‌కు కొత్త నిర్వచనం చెబితే.. తాజాగా  హర్మన్‌ప్రీత్ సేన వన్డే ప్రపంచకప్ సాధించి 2025కు ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకునేలా చేసింది.  ఈ విజయంతో మహిళల క్రికెట్ రూపు రేఖలు మారిపోనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అన్నట్లుగా మహిళల క్రికెట్ మరింత జోరందుకోవడం ఖాయం.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లు ఉన్నా, సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతున్న సమయంలో వచ్చే బలం వేరు. ఇప్పటికే రెండు దఫాలు (2005, 2017లో) రెండుసార్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చతికిలపడిన భారత్ ఈసారి మాత్రం? తన పట్టు వదలొద్దని నిర్ణయించుకొంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదన్నట్లుగా మన అమ్మాయిల బృందం పోరాడిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పొచ్చు.

లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించినప్పటికీ ఆ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలవ్వడం ఎక్కడో ఒక మూలన భయం మొదలైంది. ఆ తర్వాత తేరుకున్న హర్మన్‌ప్రీత్ సేన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జూలు విదిల్చి విజయాన్ని అందుకొని సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే సెమీస్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియా ఎదురు కావడంతో ఒకింత ఆందోళనకు గురి చేసింది.

ఎందుకంటే ఎదుట ఉన్నది సామాన్యమైన జట్టు కాదు. మహిళల క్రికెట్‌ను ఒంటి చేత్తో శాసిస్తూ ఏకంగా ఏడు సార్లు జగజ్జేతగా నిలిచిన జట్టు అది. కానీ విజయానికి కాదేదీ అనరం అన్నట్లుగా తమదైన రోజున ఎదుట ఎంతటి బలమైన జట్టు ఉన్నా పట్టుదలతో పోరాడితే విజయం దక్కుతుంది అనడానికి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఒక నిదర్శనం. కళ్లముం దు భారీ లక్ష్యం కనిపిస్తున్నా ఏమాత్రం బెదరక పోరాడిన తీరు అద్భుతమనే చెప్పాలి. జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అమూల్యమైన ఇన్నింగ్స్‌లతో భారత జట్టును విజయపథాన నిలిపారు.

తన కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ఏనాడు నిబ్బరం కోల్పోని హర్మన్‌ప్రీత్.. ఆస్ట్రేలియాపై విజయం సాధించాకా భావోద్వేగానికి లోనవ్వడం చూస్తేనే ఈ గెలుపు ఎంత మధురమనేది అర్థమవుతుంది. ఆస్ట్రేలియాపై విజయం సాధించిన రోజునే ‘ఈసారి కప్ భారత్‌దే’ అని ముందే ఊహించిన అభిమానుల కల ఆదివారంతో సాకారమయ్యింది.

నిరాదరణ నుంచి ఆదరణ దాకా

ప్రపంచకప్ విజయంతో ఇవాళ భారత మహిళల జట్టును ఆకాశానికి ఎత్తేస్తున్నాం. కానీ ఈ విజయం వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు ఉన్నాయన్న సంగతి మరువద్దు. దాదాపు ఐదు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ వస్తోంది మహిళల జట్టు.  కానీ మహిళల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళల జట్టు ఎదుగు బొదుగూ లేకుండా ఉండిపోయింది. అందుకు ప్రధాన కారణం నిధుల కొరత.

నామమాత్రపు మ్యాచ్ ఫీజులు, చాలీచాలని టీఏలు, డీఏలు, రైల్లో ప్రయాణాలు, ఇరుకు గదుల్లో బస, ప్రాక్టీస్‌కు సరైన సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది క్రికెటర్ల ప్రయాణం కష్టంగా సాగింది. ప్రయాణ ఖర్చుల కోసం చందాలు వేసుకోవడం, మహిళల క్రికెట్ వల్ల పెద్దగా ఆదాయం కూడా రాకపోవడంతో సొంతంగా చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. విదేశీ మ్యాచ్‌ల కోసం మిథాలీరాజ్ లాంటి క్రికెట్‌ర్లు చందాలేసుకొని వెళ్లిన రోజులున్నాయి.

కానీ 2006లో బీసీసీఐ గొడుగులోకి వచ్చాకా మహిళల క్రికెట్ రూపురేఖలు మారుతూ వచ్చాయి. మహిళలకు మ్యాచ్‌లు, ఫీజులు పెరిగాయి. క్రమంగా వారి ఆటతీరులో మార్పు వచ్చింది. పురుషుల క్రికెట్‌లో 300 స్కోర్లు సాధారణమైన రోజుల్లో మహిళల క్రికెట్‌లో 200 పరుగులు దాటడమే కష్టంగా ఉండేది.  చిన్న చిన్న టార్గెట్‌లను అందుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చేది. మహిళల క్రికెట్‌లోనూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తమ ఆధిపత్యం కొనసాగించిన వేళ భారత జట్టు మాత్రం సరైన ప్రాక్టీస్ లేమితో విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా చూసేవారు.

పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఆదరణ తక్కువగానే ఉంటుంది. అందునా అమ్మాయిల ఆటే కదా ఏం చూస్తాంలే అన్న చులకన భావం కూడా అభిమానుల్లో ఎక్కువగా కనిపించేది. అయితే బీసీసీఐ మహిళల క్రికెట్‌ను అక్కున చేర్చుకున్న వెంటనే పరిస్థితులు ఏం మారలేదు.

అప్పటికీ భారత మహిళల జట్టు అంటే డయానా ఎడుల్జీ, మిథాలీ రాజ్, నీతూ డేవిడ్, జులన్ గోస్వామి, అంజుమ్ చోప్రా మాత్రమే గుర్తుకు వచ్చేవారు. కానీ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన లాంటి యువతరం రాకతో మహిళల జట్టులోనూ దూకుడు పెరిగింది. షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, హర్లీన్ డియోల్ లాంటి ఆటగాళ్లతో మహిళల జట్టుకు కళ వచ్చింది. 

అంజుమ్ చోప్రా

భారత కెప్టెన్‌గా కీలక సేవలందించిన అంజుమ్ చోప్రా 18 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం కామంటేటర్‌గా బిజీగా ఉన్న అంజుమ్ చాలా ఏళ్లు స్టార్ క్రికెటర్‌గా వెలుగొందారు. భారత్ తరఫున నాలుగు వన్డే ప్రపంచకప్‌లో పాటు 100 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కారు. ఓవరాల్‌గా 127 వన్డేలు, 12 టెస్టులు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అర్జున అవార్డు (2007), పద్మశ్రీ (2014) పురస్కారాలు అందుకుంది.

నీతూ డేవిడ్

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నీతూ డేవిడ్ ఎడమచేతి వాటం స్పిన్నర్. 1995-2008 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన నీతూ డేవిడ్ కెరీర్‌లో 97 వన్డేలు, 10 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 2005 వన్డే ప్రపంచకప్‌లో 20 వికెట్లు పడగొట్టిన నీతూ డేవిడ్ టోర్నీలో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచింది.

జులన్ గోస్వామి

మహిళల క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో జులన్ గోస్వామి చోటు సంపాదించారు. బెంగాల్‌కు చెందిన జులన్ రెండు దశాబ్దాలకు పైగా భారత పేస్ జట్టుకు నాయకత్వం వహించి ఎంతో మంది మహిళా క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచారు. వన్డేలు, టీ20లు కలిపి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఖ్యాతి గడించిన జులన్ గోస్వామి వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. మొత్తంగా 44 టెస్టులు, 255 వన్డేలు, 56 టీ20లు ఆడింది.

మిథాలీరాజ్

మిథాలీ రాజ్ భారత మహిళల క్రికెట్‌కు ఒక దిక్సూచి లాంటిది. రెండు దశాబ్దాలుగా మహిళల క్రికెట్‌లో అన్నీ తానై నడిపించారు. 9 ఏళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టిన మిథాలీ రాజ్ తన 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించింది. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు (7,805) సాధించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. మహిళల వన్డే ప్రపంచకప్ ఈవెంట్‌లో ఏకంగా ఆరుసార్లు పాల్గొన్న క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఇందులో రెండుసార్లు (2005, 2017) జట్టును ఫైనల్స్ దాకా తీసుకెళ్లి భారత మహిళా క్రికెట్‌కు గౌరవాన్ని, స్వర్ణయుగాన్ని తీసుకొచ్చింది. 

ఓవరాల్‌గా మిథాలీరాజ్ 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అన్ని ఫార్మాట్లు కలిపి 10వేలకు పైగా పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కింది. ధోనీతో సమానంగా మహిళల కెప్టెన్‌గా ఖ్యాతి గడించింది. అంచలంచెలుగా ఎదిగి మహిళల క్రికెట్‌కు ముఖచిత్రంగా మారింది. ఇవాళ.. వన్డే ప్రపంచ కప్ చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులోని సభ్యుల్లో దాదాపు అందరికీ మిథాలీనే ఆదర్శం. గతంలో మిథాలీ వేసిన పునాదికి ఇప్పుడు ప్రపంచ కప్ విజేత రూపంలో ప్రతిఫలం దక్కిందనుకోవచ్చు.

20 ఏళ్లలో ఎన్నో మార్పులు

మహిళల మ్యాచ్‌లు టీవీల్లో చూడడానికి అంతగా ఇష్టపడేవాళ్లు కాదు. అలాంటిది స్టేడియాలకు వచ్చి మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ముందుకు రాకపోవడంలో వింతేమి లేకపోయేది. కానీ పురుషుల క్రికెట్‌కు తాము ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తూ హర్మన్ ప్రీత్, మంధాన, రోడ్రిగ్స్, షెఫాలీ లాంటి ఆటగాళ్లు చూపించారు. కళాత్మక బ్యాటింగ్, విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకొని వేలాది మంది అభిమానులను స్టేడియాలకు వచ్చేలా చేశారు.

2005 వన్డే ప్రపంచకప్ ఫైనల్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య 2 వేల కంటే తక్కువే. కానీ 20 ఏళ్ల తర్వాత అదే వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా తలపడుతుంటే టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందంటే మహిళల క్రికెట్ ఎంతగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో సిరీస్‌లు అంటే ఒక్క విజయం ఆశించడమే గొప్ప.

అలాంటిది ఇవాళ భారత మహిళల జట్టు వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తుంది. ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన హర్మన్ సేన టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.  ఇక భారత మహిళల జట్టు ఆటలో పదను పెరగడానికి మరో ప్రధాన కారణం జట్టు కో అమోల్ మజుందార్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అమోఘమైన బ్యాటింగ్ ట్రాక్ రికార్డు కలిగి ఉన్న మజుందార్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ కోగా మారి అటు దేశవాలీ రంజీ క్రికెట్‌తో పాటు అమ్మాయిల జట్టుకు కోగా మారి అద్భుతాలు చేస్తున్నారు.

జట్టులో సీనియర్లయిన హర్మన్ ప్రీత్, మంధాన, దీప్తి శర్మలను స్వేచ్ఛగా ఆడేలా చేయడంతో పాటు యువరక్తం శ్రీచరణి, అరుంధతీ రెడ్డి లాంటి ప్లేయర్లను ప్రోత్సహించి ఇవాళ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2023లో కోగా ఎంపికైన సమయంలో ఇతను ఏం చేస్తాడు అని పెదవి విరిచారు.. కానీ ఇవాళ తనపై నోరు పారేసుకున్నవారితోనే శెభాష్ అనిపించుకోవడం గొప్ప విషయం. తాజా ప్రపంచకప్ విజయంతో అమ్మాయిల క్రికెట్ మరోస్థాయికి చేరడం ఖాయం. ఇప్పటిదాకా భారత మహిళా క్రికెటర్లు ఏం సాధించినా పెద్దగా పట్టించుకోనప్పటికీ..

ఇప్పుడు వచ్చిన ప్రపంచకప్ విజయం మాత్రం క్రికెట్ రూపురేఖలను మార్చబోతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా దేశంలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని భావిస్తున్న నేటి యువతరంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శిక్షణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి. పురుషుల క్రికెట్‌లో విశిష్ట క్రేజ్ పొందిన ఐపీఎల్ లాగే మహిళల క్రికెట్‌లోనూ డబ్ల్యూపీఎల్ పేరుతో లీగ్ తీసుకురావడం, అది విజయవంతం కావడం మహిళల క్రికెట్ ఎదుగుదలను స్పష్టంగా చూపిస్తుంది.

డయానా ఎడుల్జీ

ఈమె ప్రస్తుత తరానికి పరిచయం లేని పేరు. మహిళా క్రికెట్‌కు ప్రాముఖ్యత తెచ్చినవారిలో ఈమె ఒకరు. నిజానికి డయానా ఎడుల్జీ బ్యాటు పట్టేనాటికి దేశంలో మహిళా క్రికెట్‌కు చోటే లేదు. అయితే 50 సంవత్సరాల్లో క్రికెటర్‌గా, అడ్మినిస్ట్రేట్‌గా ఎడుల్జీ భారత క్రికెట్‌కు సేవలందించింది.

ఈమెను స్ఫూర్తిగా తీసుకొని అప్పట్లో చాలా మంది అమ్మాయిలు క్రికెట్‌కు ఆకర్షితులై ఆటలోకి అడుగుపెట్టారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన డయానా ఎడుల్జీ భారత్ తరఫున 54 మ్యాచ్‌ల్లో 109 వికెట్లు పడగొట్టింది.