calender_icon.png 9 October, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

08-10-2025 12:00:00 AM

  1. మేడ్చల్ పట్టణంలో తరచూ ప్రమాదాలు 
  2. వారంలో నలుగురు దుర్మరణం ఇప్పటివరకు 40 మంది పైగా మృతి 
  3. ఇష్టానుసారంగా జాతీయ రహదారి, ఫ్లైఓవర్ పనులు 
  4. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి కరువు 
  5. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలు

మేడ్చల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో 44 వ నెంబర్ జాతీయ రహదారి మృత్యు రహదారిగా మారింది. ద్విచక్ర వాహనంపై రోడ్డుమీదకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరుకుంటారనే గ్యారెంటీ లేకుండా పోయింది. ఇంటికి వచ్చేవరకు కుటుంబ సభ్యులు భయం భయంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ కంటైనర్ లు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టి మీద నుంచి వెళ్ళిపోతున్నాయి.

శరీర భాగాలు ఛిద్రమై ఘోరమైన మరణాలు జరుగుతున్నాయి. సోమవారం పట్టణంలో ఒకే చోట రెండు ద్విచక్ర వాహనాల మీద వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. భారీ కంటైనర్ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఒక ద్విచక్ర వాహనం మీద భార్యాభర్తలు వెళ్తుండగా కంటైనర్ ఢీకొట్టడంతో కింద పడ్డారు. భార్య కళావతి(35) మీద నుంచి కంటైనర్ వెళ్లడంతో శరీర భాగాలు చిద్ర మయ్యాయి.

మరో వాహనం మీద వెళ్తున్న రాజిరెడ్డికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదం పట్టణ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. వారం రోజుల్లో పట్టణ పరిధిలో నలుగురు మృతి చెందగా, ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 

ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం 

మేడ్చల్ పట్టణం మధ్య నుంచి జాతీయ రహదారి వెళ్తుంది. ట్రాఫిక్ కు అంతరాయం కలగవద్దని ఉద్దేశంతో రెండేళ్ల క్రితం సుచిత్ర నుంచి కాళ్లకల్ వరకు ఫ్లై ఓవర్లు, రహదారి విస్తరణ పనులు చేపట్టారు. కాంట్రాక్టు కంపెనీ ఒక రాజకీయ నాయకునికి చెందినది. దీంతో తమను అడిగే వారే లేరని ఉద్దేశంతో నిబంధనలు తుంగలో తొక్కి ఇస్తానుసారంగా పనులు చేస్తున్నారు.

కండ్లకోయ, కొంపల్లి ప్రాంతాల్లో పక్కన సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ నిర్మించి ఆ తర్వాత మధ్యలో ఫ్లై ఓవర్ పిల్లర్లు నిర్మిస్తున్నారు. మేడ్చల్ లో అలా చేయకుండా ఇరుకు రోడ్డులోనే ఫ్లై ఓవర్ పనులు చేస్తుండడంతో ప్రమాదాలు జరగడమే గాక ట్రాఫిక్ కు కూడా ఇబ్బంది అవుతుంది. మేడ్చల్ లో కొన్నిచోట్ల భూసేకరణ సమస్య ఉన్న మరికొన్నిచోట్ల సమస్య లేదు.

రహదారిని ఇరువై పులా 75 అడుగులకు విస్తరించాలని నిర్ణయించి యజమానులకు గతంలోనే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 75 అడుగులకు విస్తరించడం వల్ల కొందరికే నష్టం జరుగుతుంది. మిగతా ప్రాంతంలో వెడల్పు చేసే అవకాశం ఉన్న చేయడం లేదు.

అత్వెల్లి నుంచి బస్ డిపో వరకు ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరగడం లేదు. ఇక్కడ రోడ్డు విస్తరించే అవకాశం ఉన్న చేయడం లేదు. అలాగే మేడ్చల్ నుంచి చెక్ పోస్టు వరకు కూడా విస్తరించవచ్చు. చెక్ పోస్ట్ వద్ద మాత్రమే కొంత భాగంలో న్యాయపరమైన సమస్య ఉంది. షెడ్లు వేసుకున్న వారు కోర్టును ఆశ్రయించారు. 

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం 

జాతీయ రహదారి పనుల విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. జాతీయ రహదారుల శాఖ ఎన్ హెచ్ ఎ ఐ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నా యి. ప్రజలు తమ సమస్యలు విన్నవించడానికి స్థాని కంగా అధికారులకు ఉండరు. దీనికి సంబంధించిన కార్యాలయం కామారెడ్డి లో ఉంది. ఎన్ హెచ్ ఎ ఐ అధికారులు మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులను పట్టించుకోరని ఆరోపణలు ఉన్నాయి.

ప్రజా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి కరువు 

మేడ్చల్ పట్టణంలో తరచు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతున్నప్పటికీ ఒక్క రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. ప్రజా సమస్యలపై నాయకులకు చిత్తశుద్ధి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రైవేటు ప్రారంభోత్సవాలకు, ఫంక్షన్లకు హాజరయ్య నాయకులు మేడ్చల్ లో రోడ్డు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

సోమవారం రెండు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయిన ఘటనతో ప్రజలు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఈరోజు వారు, రేపు ఎవరు? అంటూ ఆవేదనతో కామెంట్లు పెట్టారు. దీనిని ఇంతటితో వదిలిపెట్టవద్దని తమ బాధ్యతగా ప్రతి ఒక్కరు ఆందోళనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది.