17-10-2025 01:25:41 AM
- పడకేసిన పారిశుద్ధ్యం ప్రజాజీవనం అస్తవ్యస్తం.
-పట్టించుకోని కార్యదర్శులు పేరుకుపోతున్న చెత్తా, చెదారం
-పెచ్చురిల్లుతున్న రోగాలు ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు
- పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వేడుకోలు
మోతె, అక్టోబర్ 16 : పరిశుభ్రత పై పట్టింపు లేకపోవడం వలన మండలంలో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. చెత్తా,చెదారం కుప్పలు వీధులలో దర్శనం ఇవ్వడంతో పాటు మురుగునీరు ఎక్కడికి అక్కడ నిలిచి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీంతో చూపరులు ఊర్లన్నీ రోత.. అధికారుల కళ్లకు గంత.. అంటూ బాహాటంగానే తన అభిప్రాయాలను చెబుతున్నారు. మండలంలోని 29 గ్రామలలో పారిశుద్ధ్యం పడకేసింది. దీంతో ప్రజాజీవనం అస్తవ్యస్తం అయింది.
గ్రామాలలో దోమల మందు స్ప్రే చేయడం, బ్లీచింగ్లు చెల్లించడం వంటి పనులు అసలు చేయకపోవడం గమనించదగిన విషయం. మొత్తానికి గ్రామాలలో పారిశుధ్యం గురించి పట్టించుకునే నాధుడు కరువైండు. అధికారులు కేవలం విధులకు హాజరై పోతున్నారు తప్ప అసలు విషయాల గురించి పట్టించుకోవడం లేదు. దీనితో ప్రజలు అనారోగ్యాల పాలై వేలకు వేలు హాస్పటల్లో కట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇక గ్రామాలలో వీధిలైట్ల మాట దేవుడికి ఎరుక. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ఇంతవరకు కళ్ళు తెరవట్లేదు.
పట్టింపులేని పారిశుద్ధ్యం
గ్రామాలలో పారిశుధ్యం పై పట్టింపు లేకుండా ఊర్లంతా చెత్త కుప్పలతో దర్శనమిస్తున్నాయి. మురుగునీరు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈ మురుగు నీరు త్రాగునీరులో కలవడం వల్ల మొత్తం నీరు కలుషితమవుతుంది. వాటినే తాగడం వల్ల చాలామంది ఇప్పటికే అనారోగ్యాల పాలై ఆస్పత్రులలో చేరి వేలకు వేలు ఖర్చులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా పట్టించుకోకపోవడం గమనారం.
విని వదిలేస్తున్న కార్యదర్శులు
ఊరంతా అపరిశుభ్రంగా ఉందని గ్రామ కార్యదర్శులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఒకరిద్దరు గట్టిగా అడిగినా మాకు నిధులు రావడంలేదు, ఇప్పటికే మా సొంత డబ్బు చాలా పెట్టాము అనే సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఎంత చెప్పినా గ్రామ కార్యదర్శులు విని వదిలేస్తున్నారు తప్ప గ్రామాలలో పరిశుభ్రత పనులు చేపట్టడం లేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శులపై తగు చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
వీధిలైట్లు వెలుగక చానాలైంది
మా తండాలో వీధిలైట్లు వెలగక ఛానాలైంది. రాత్రిపూట బయటికి వెళ్లాలంటేనే భయం వేస్తుంది. దీంతో వీధిలైట్ల గురించి కార్యదర్శిని అడగగా గ్రామపంచాయతీ నిధులు లేవు నా సొంత ఖర్చుతో పెట్టియలేను అని చెప్పాడు. ఇప్పటికైనా అధికారులు నిధులు మంజూరు చేయించి ఊర్లలో ఏ ఇబ్బందులు లేకుండా చూడాలి.
గుగులోతు కోటేష్, గోపతండ వాసి
మూడు రోజుల్లో పనులు చేయిస్తా
గ్రామాలలో పారిశుద్ధ్య సమస్యలు నా దృష్టికి రాలేదు. సాధ్యమైనంత వరకు అన్ని పనులు మండలంలో సక్రమంగానే చేయిస్తున్నాం. ఇప్పుడు సమస్య నా దృష్టికి వచ్చింది కావున తప్పకుండా మూడు రోజుల్లో అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేయిస్తా. ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా చూడడమే మా ప్రధాన బాధ్యత.
ఆంజనేయులు, ఎంపీడీవో మోతె