20-10-2025 02:04:00 AM
ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మరో ఇద్దరు స్మగ్లర్ల నిర్బంధం
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అమెరికా సహించదన్న ట్రంప్
వాషింగ్టన్, అక్టోబర్ 19: కరేబియన్ సముద్రం నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్న జలాంతర్గామిని తాజాగా అమెరికా భద్రతా దళాలు ముంచేశాయి. అమెరికా వైపు అక్రమ మార్గంలో దూసుకొస్తుండగా జరిగిన దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమ వ్వగా మరో ఇద్దరు స్మగ్లర్లు భద్రతా దళాలకు చిక్కారు.
విచారణ నిమిత్తం ఆ స్మగ్లర్లను వారి స్వదేశాలైన కొలంబియా, ఈక్వెడార్‌కు పంపించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో అమెరికా సైనికులు ఎవరూ గాయపడలేదని తెలిపారు. అయితే, ఈ విషయాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో కూడా ధ్రువీకరిం చారు.
డ్రగ్స్ రవాణాను సహించం : ట్రంప్
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను భూమి, సముద్రం ద్వారా అమెరికా సహించదని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒక వేళ ఆ జలాంతర్గామిని అనుమతిస్తే సుమారు 25000 అమెరికన్లు చనిపోయి ఉండేవారని ఆందోళనవ్యక్తం చేశారు. కాగా, అమెరికా భద్రతా దళాలు ముంచేసిన జలాంతర్గామి ఫెంటానైల్, ఇతర అక్రమ మాదకద్రవ్యాలతో లోడ్ చేయబడిందని యూఎస్ ఇంటెలిజెన్స్ ధ్రువీకరించింది.
సెప్టెంబర్ నుంచి ఆరు నౌకలను..
లాటిన్ అమెరికా దేశాల నుంచి డ్రగ్స్‌ను తమ వైపు రానీయకుండా అమెరికా కరేబియన్ సముద్రంలో భారీగా భద్రతా దళాలను మోహరించింది. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికా వైపు అక్రమంగా వస్తున్న ఆరు నౌకలను భద్రతా దళాలు ముంచేసినట్లు అమెరికా ప్రకటించింది.
అయితే, ఈ దాడులు మొత్తం వెనిజుల తీరంలోనే చోటు చేసుకున్నాయని పేర్కొంది. కాగా, లాఠిన్ అమెరికా డ్రగ్స్ ముఠాలు అక్రమ రవాణాలకు జలాంతర్గాములను వాడటం ఇదే తొలిసారి కాదని 1990 నుంచి అక్కడి స్మగ్లర్లు అమెరికా భద్రతా దళాల గస్తీలను తప్పించుకోవడానికి వీటిని వాడుతున్నారని తెలిపింది.