20-10-2025 01:54:10 AM
తొమ్మిది విలువైన వస్తువుల అపహరణ
ప్యారిస్, అక్టోబర్ 19: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్యారిస్ లౌవ్రే మ్యూజియంలోని తొమ్మిది పురాతన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మ్యూజియానికి ఒక వైపు కొత్త కట్టడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దుండగులు అటువైపు వెళ్లి లోపలికి చొరబడ్డారు. అనంతరం వస్తువులు తరలించే ఎలివేటర్ ద్వారా ‘అపోలో గ్యాలరీ’లోకి ప్రవేశించారు.
నెపోలియన్ కాలం నాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తొమ్మిది విలువైన వస్తువులను అపహరించి ఉడాయించారు. ఘటన జరిగిన కొద్దిగంటల తర్వాత సిబ్బంది మ్యూజియంలోని వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఫ్రాన్స్ ప్రభుత్వ ఆదేశాల మేర కు మ్యూజియాన్ని మూసివేశారు. పోలీసు లు ఘటనా స్థలం వద్దకు చేరకుని దర్యాప్తు చేపట్టారు.
మ్యూజియంలో చోరీ జరగడం ఇదే మొదటిసారి కాదు. 1911లో మ్యూజియంలో ప్రదర్శనకు ఉండే ‘మోనాలిసా’ చిత్తరువును విన్సెంజో పెరుగ్గియా అనే వ్యక్తి దొంగలించాడు. అక్కడ పోలీసులు రెండేళ్లపాటు చిత్తరువు చోరీపై విచారణ చేపట్టి, చివరకు నిందితుడిని పట్టుకోగలిగారు.
అతడి నుంచి మోనాలిసా చిత్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. అలాగే 1983లో మ్యూజియం నుంచి రెండు పురాతన కవచాలను దుండగులు అపహరించారు. ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.