12-01-2026 02:44:43 AM
రెండు రోజుల్లో 404 కేసులు.. .బైక్ రైడర్లే అధికం
300 పాయింట్లు దాటిన మోతాదులో 12 మంది పట్టివేత
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్
హైదరాబాద్, సిటీబ్యూరో జనవరి 11(విజయక్రాంతి) : నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా గత రెండు రోజులు జనవరి 9, 10 తేదీల్లో నగరవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు. కేవ లం 48 గంటల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 404 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కా రు. ఈ స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే కావడం ఆందోళన కలిగిస్తోంది. నమోదైన మొత్తం 404 కేసుల్లో.. 349 మంది బైక్ రైడర్లు ఉండగా, 24 మంది ఆటో డ్రైవర్లు, 31 మం ది కారు, ఇతర వాహనదారులు ఉన్నారు.
మద్యం మత్తులో వాహనా లు నడపడం వల్ల తమ ప్రాణాలే కాకుండా, ఇతర అమాయక ప్రయాణికుల ప్రాణాలకు కూడా ము ప్పు వాటిల్లుతోందని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. వాహనదారులకు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్ష ల్లో వచ్చిన రీడింగ్స్ చూసి పోలీసులే విస్తుపోయారు. 30 నుండి 50 పాయింట్ల మధ్య లో 77 మంది పట్టుబడగా, 51 నుండి 100 పాయింట్ల మధ్యలో అత్యధికంగా 151 మం ది ఉన్నారు. ఇక 101-150 పాయింట్ల మధ్య 87 మంది, 151-200 మధ్య 45 మంది, 201-250 మధ్య 23 మంది, 251-300 మధ్య 9 మంది పట్టుబడ్డారు. అత్యంత ప్రమాదకరమైన స్థాయిగా పరిగణించే 300 పాయింట్ల కంటే ఎక్కువ రీడింగ్ వచ్చిన వారు 12 మంది ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
జీరో టాలరెన్స్..
డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తాము జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ కేవలం రెండు రోజులతో ఆగిపోదని, ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.