20-09-2025 12:58:12 AM
- రామగుండంలో దసరా ఉత్సవాల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం, సెప్టెంబర్ 19: దసరా ఉత్సవాలను గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన దసరా ఉత్సవాల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఉత్సాహంగా ,ఉల్లాసంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేయడానికి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు , విభాగాలు తగు ఏర్పాట్లు చేసి సహకరించాలని కోరారు. సింగరేణి సంస్థ సౌజన్యంతో గత ఏడాది గోదావరి ఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో విజయదశమి రోజున ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ ఏడాది కూడా సింగరేణి సంస్థ గతంలో కంటే మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని కోరారు. దసరా ఉత్సవాల నిర్వహణకు ఎన్టీపీసి సంస్థ నిధులు మంజూరు చేయగా, రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో పనులు చేపట్టడం జరిగిందని, అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తూ మరిన్ని ఎక్కువ నిధులు మంజూరు చేయాలని సూచించారు. ఆర్ ఎఫ్ సి ఎల్ కూడా ఉత్సవాల నిర్వహణలో భాగం పంచుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఉత్సవాలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను కోరారు.
స్టేడియం లో రావణ వధతో పాటు వినోదభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయాలని, అమ్మ వారి విగ్రహాలను ప్రతిష్టించే వారు పూర్తిగా రోడ్డును ఆక్రమించకుండా కనీసం అంబులెన్స్ వెళ్ళడానికి దారి ఉంచాలన్నారు. అలాగే మండపాల ఏర్పాటు కొరకు రోడ్లు తవ్వవద్దని ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించా లని, రోడ్లను తవ్వుతూ ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేస్తున్న వారికి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. నగరంలో జరుగుతున్న ఉత్సవాలను విజయవంతం చేయడంలో సహకరిస్తున్న అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న సమ్మక్క సార లమ్మ జాతరకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని, గడువు తక్కువగా ఉన్నందున ఏర్పాట్లు వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ రామగుండం, ఇంచార్జీ కమిషనర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ సింగరేణి, ఎన్ టిపి సి, ఆర్ ఎఫ్ సిఎల్ , జెన్ కో, ఎన్ పిడిసి ఎల్, పోలీస్ తదితర అన్ని విభాగాల సహకారంతో బతుకమ్మ పండుగ , దసరా ఉత్సవాల నిర్వహణకు కు ఏర్పాట్లు చేస్తామని, బతుకమ్మ ఆటస్థలం, నిమజ్జనం చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, కీలక ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేస్తామని, గోదారి నది వద్ద కూడా అన్ని విభాగాల సహకారంతో నిమజ్జన ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఈ సమావేశంలో ఎసిపి మడత రమేష్ , సింగరేణి ఆర్జీ-1 జిఎం లలిత్ కుమార్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి , డిజిఎం సివిల్ వర ప్రసాద్ , ఆర్ ఎఫ్ సిఎల్ మేనేజర్ శుక్లా, వంశీ కృష్ణ , టి జి ఎన్ పిడి సిఎల్ డిఈ ప్రభాకర్, ఎడిఈలు వెంకటేశ్వర్లు , రమేష్ , జిల్లా మత్స్య శాఖాధికారి నరేష్ కుమార్, నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ , డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు, డిప్యూటీ తహశీల్దార్ బి, లక్ష్మీ , ఫైర్ ఆఫీసర్ రాజేశ%ళి%, ఎన్ టిపిసి అధికారులు సూర్య నారాయణ, కార్తీక్ , 1- టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి , ట్రాఫిక్ సిఐ రాజేశ్వర్ రావు, ఎస్‌ఐ హరి శంకర్, సింగరేణి అధికారులు రవీందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి , ముస్తాఫా , నాయకులు తానిపర్తి గోపాల్ రావు , ప్రకాష్ , రమేష్ , రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.