04-10-2025 12:07:05 AM
ఆదిలాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే విజయ దశమి వేడుక సంబరాలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. గురువారం హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక దసరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధి పతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు హాజరయ్యారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులతో కాకుండా ముందుగానే వేడుకల్లో పాల్గొన్నారు.
అనాదిగా వస్తున్న కార్యక్రమం ఆచారంలో భాగంగా ముందుగా శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో కలెక్టర్, ఎస్పీ లు ప్రత్యేక పూజ లు చేసి, అక్కడి నుండి దసరా మైదానం వరకు కాషాయపు జెండాలను చేతపట్టుకుని పాదయాత్రగా వెళ్లారు. అనంతరం జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మైదానంలో ఏర్పా టు చేసిన భారీ రావణ ప్రతిమాకు ఎస్సీ నిప్పంటించి దహనం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... విజయదశమి అంటే చెడుపై మంచిని సాధించడమే అని అన్నా రు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... విజయదశమి రోజే రావణ దహనంతో పాటు మనలోని కోపం, అహంకారం, అసూయను వదిలేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షులు బొంపల్లి హన్మాడ్లు, ప్రధాన కార్యదర్శి రాళ్లబండి మహేందర్, పలువురు అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.