calender_icon.png 4 October, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 వేల మంది టీసీఎస్‌లో లేఆఫ్స్ మొదలు

04-10-2025 01:57:33 AM

టీసీఎస్‌లో లేఆఫ్స్ మొదలు

  1. నైపుణ్యంలేని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటన
  2. పరిహారంగా ఆరు నెలల నుంచి అత్యధికంగా రెండేళ్ల వేతనం 
  3.   8 నెలలకుపైగా బెంచ్‌పై ఉన్న వారికి ‘సింప్లర్ ప్యాకేజీ’

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) లేఆఫ్ ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడా ది జూలైలో ప్రకటించిన 12 వేల మందికి లేఆఫ్‌ను చేపట్టింది. ప్రస్తుత ఆటోమేషన్ ప్రపంచంలో కంపెనీ అవసరాలను తీర్చలేని ఉద్యోగులను తొలగిస్తుంది. తద్వారా వేలాది మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టనున్నారు. అయితే చాలాకాలంగా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం భారీగా పరిహారం చెల్లించనున్నది. అత్యధికంగా దాదాపు రెండేళ్ల వేత నాన్ని పరిహారం కింద చెల్లించనుంది.

క్లయింట్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడం, నైపుణ్యాలు లేని ఉద్యోగులను తొలగిస్తున్నట్టు టీసీఎస్ ప్రకటించింది. ఇందులో భాగంగా మూడు నెలల నోటీ సు పీరియడ్ ఇస్తోంది. ఈ మూడు నెలలూ యథావిధిగా వేతనం చెల్లిస్తుంది. దీంతోపాటు తొలగించే ఉద్యోగులకు ఆరు నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహార ప్యాకేజీ కింద చెల్లించనున్నది. అయితే ఎవరైనా 8 నెలలకు మించి బెంచ్ పై ఉంటే వారికి ‘సింప్లర్ ప్యాకేజీ’ కింద కేవలం మూడు నెలల వేతనాన్ని మాత్ర మే చెల్లిస్తారు. 

పరిహారంగా రెండేళ్ల వేతనం

కంపెనీలో పదేళ్ల నుంచి 15 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ తాజా లేఆఫ్‌లో ఉద్యోగం కోల్పోయిన వారికి ఏడాదిన్నర వేతనాన్ని పరిహారంగా చెల్లిస్తారు. అదే 15 ఏళ్లు దాటిన వారికి అత్యధికంగా రెండేళ్ల వేతనంగా ఇస్తారు. దీంతోపాటు అదనంగా అవుట్ ప్లేస్‌మెంట్ సేవలు లభిస్తాయి. అవసరమైన వారికి టీసీఎస్ కేర్స్ ప్రోగ్రా మ్ కింద మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స లేదా థెరపీని అందిస్తారు. దీంతోపాటు రిటైర్‌మెంట్‌కు దగ్గర పడిన వారికి ముందస్తు పదవీ విరమణకూ టీసీఎస్ అవకాశం కల్పిస్తుంది. వీరికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని ప్యాకేజీ కింద చెల్లించడంతోపాటు బీమా ప్రయోజనాలను కల్పిస్తారు. 

భారత్‌లో లక్షకు పైగా..

2025లో భారతదేశంలోని ఐటీ కంపెనీలు భారీగా లే ఆఫ్స్ ప్రకటించాయి. ప్రస్తుత ఏడాది మొదటి భాగంలోనే ఐటీ రంగంలో 1,30,000 మందికిపైగా ఉద్యోగాలను కోల్పోయారు. ప్రముఖ సంస్థలు, ఎంతమంది ఉద్యోగులను లే ఆఫ్‌కు గురి చేశాయి. అత్యధికంగా మధ్య స్థాయి, సీనియర్ ఉద్యోగులతో పాటు, ప్రాజెక్ట్ లేకుండా బెంచ్‌పై ఉన్న వారినే ఎక్కువగా టార్గెట్ చేశారు. 2025లో జనవరి నుండి సెప్టెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో 2,00,000కి పైగా ఉద్యోగులను తొలగించామని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

మొత్తంగా ఈ లేఆఫ్స్ సంఖ్య 2,35,000 దాటి పోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఉద్యోగుల లేఆఫ్స్ ఇండియన్ ఐటీ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏడాది చివరి వరకూ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2025లో ఎక్కువగా ఏఐ, ఆటోమేషన్, సామర్థ్య ఆధారిత మోడ్రనైజేషన్ కారణంగానే ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగాయి. ఇప్పటివరకు ఏ సంవత్సరంలోనూ లేనివిధంగా 2025లో టాప్ 10 సంస్థలే లక్షలకు పైగా ఉద్యోగాలను తొలగించాయి. 

లేఆఫ్స్‌కు ప్రధాన కారణాలు.. 

* ఏఐ, ఆటోమేషన్ ప్రభావం : ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృతంగా ఉపయోగించడంతో మానవ శ్రమ అవసరం తగ్గింది. దీనివల్ల సాధారణ, పునరావృత పనులు త్వరగా ఆటోమేట్ కావడంతో ఉద్యోగాలు తగ్గాయి.

* పనితీరు ఆధారిత తొలగింపులు : అతి తక్కువ పనితీరు కనబరిచిన ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. మెటా, గూగుల్ వంటి సం స్థలు ప్రత్యేకంగా ఏఐ ఉద్యోగాలకు డి మాండ్ పెరగడంతో నైపుణ్యం పెంచుకోని ఉద్యోగులను పక్కనబెట్టాయి.

* ప్రాధాన్యతల మార్పు : వ్యాపార ప్రాధాన్యతలు మారడం, వ్యూహాత్మక వృద్ధిపై దృష్టి పెట్టడంలో భాగంగా ఆయా కంపెనీలు ఉద్యోగులకు స్వస్తి పలికాయి. 

* ఖర్చు తగ్గింపు : ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు ఖర్చు ను తగ్గించుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగం గా భారీ లే ఆఫ్స్ ప్రకటించాయి.

* మార్కెట్ అనిశ్చితి : నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మారుతున్న వినియోగదారుల డిమాండ్‌తో కంపెనీలు తమ  వ్యూహాలను మార్చాల్సి వచ్చింది. 

* సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోకపోతే : ఉద్యోగుల్లో కొత్త నైపుణ్యాలు లేకపోతే, చిన్న ప్రాజెక్ట్లు, బెంచ్‌పై ఉన్న వారిని తొలగించడమే లక్ష్యంగా మారింది. 

    అత్యంత డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలు..

    * ఏఐ, మెషీన్ లెర్నింగ్ పరిజ్ఞానం

    * డేటా అనలిటిక్స్ డేటా సైన్స్

    * క్లౌడ్ కంప్యూటింగ్(ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్)

    * సైబర్ సెక్యూరిటీ

    * ఫుల్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్

    * ఆటోమేషన్ టెస్ట్ అండ్ డెవాప్స్

    * డిజిటల్ మార్కెటింగ్

    * యూఐ/యూఎక్స్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్

    * అజైల్/స్క్రమ్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్

    * కమ్యూనికేషన్, టీమ్ వర్క్

    కంపెనీల వారీగా లేఆఫ్‌లు.. 

    కంపెనీ పేరు                        లేఆఫ్ ఉద్యోగుల సంఖ్య

    ఇంటెల్                                  21,000

    టీసీఎస్(ఇండియా)            12,000

    మైక్రోసాఫ్ట్                                9,000

    ప్యానాసోనిక్                      10,000

    మెటా                                3,600

    ఒరాకిల్                              2,000+

    బ్లాక్(ఫిన్‌టెక్)                          1,000

    బర్బెరీ                                    1,700

    ఇండీడ్, గ్లాస్‌డోర్                    1,300

    గూగుల్                                    100+

    యూపీఎస్                              20,000