calender_icon.png 4 October, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేలిన పంటకు తెగుళ్లు

04-10-2025 01:42:57 AM

  1. వర్షాలతో మునిగిన రైతు.. 
  2. ఎర్రబారుతున్న పత్తి, ఇతర పంటలు 
  3. అధిక వర్షాలతో  2.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం 
  4. రూ. 250  కోట్ల మేర నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అంచనా

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాల వల్ల పంటలకు నష్టం జరగడంతో పాటు.. ఇప్పుడు రైతున్నలను తెగుళ్లు  మరింత నష్టాలకు గురిచేస్తున్నాయి.  పంట చేతికొచ్చే సమయంలో వానలు రైతుల వెన్ను విరిచాయి. పత్తి పంట భారీ గా దెబ్బతినగా మిర్చి, మొక్క జొన్నలది అదే పరిస్థితి. వరి పంట ఎర్రబడింది.. రసం పీల్చే పురుగులు పత్తి కాయలను ఎండబెడుతున్నాయి.. మొక్కజొన్న కర్రలు కిందపడుతున్నాయి. రైతన్నల ఆందోళనకు ఇవీ కారణాలు.

చాలా ప్రాంతాల్లో మెగ్నీషియం ధాతువు లోపించి పంట మొక్కలు పడిపోతున్నాయి. రేగడి నేలల్లో వరద నీరు, అధిక తడి ఉంటుండటంతో మొక్కలు ఎర్రబారడం, వేర్లు నలుపురంగుకు మారడం జరుగుతున్నాయి. కాండం మధ్య భాగం బూడిద రంగులోకి మారుతుండటంతో మొక్కలు పోషకాలను తీసు కోలేక ఎండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్లకు వరకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అం దించింది. 28  జిల్లాల్లో 2.50 లక్షల ఎకరాల్లో  పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. 

వరికి భారీగా నష్టం..

వరి అత్యధికంగా 1.09 లక్షల ఎకరా లు, 60 వేల ఎకరాలు, మొక్కజొన్న పంట 20 వేల ఎకరాలకు పైగానే దెబ్బతిన్నాయి,  ఇక ఉద్యాన పంటలు 20,983 ఎకరాలకు పైగానే ఉండగా, సోయాబీన్, కందులు, పెసర్లు, మినుములు ఇతర పప్పుధాన్యాలు, జొన్న, టమాటా, మిరప పంటలు కూడా వేలాది ఎకరాల్లో  దెబ్బతినడంతో పంట నష్టం తీవ్రంగానే  వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో వరి 70 లక్షల ఎకరాలు, పత్తి 45.47 లక్షల ఎకరాల్లో, మొక్కొజొన్న 6.44 లోల ఎకరాల్లో, మిర్చి 1.2 లక్షల ఎకరాల్లో వేశారు. అయితే గత నెలలో మొదలై దాదాపు నెల రోజులుగా వర్షాలు కొనసాగడంతో.. వర్షం నీటిలో పోలాలు మునిగిపోవడం, భూమిలో తేమ ఆరకపోవడం, వేర్ల ద్వారా పొషకాలు అందక ఆకులు ఎరపు, నలుపు రంగులోకి మారిపోయితున్నాయి. పూత పడిపోవడం, పత్తి కాయలు రాలిపోవడం, మొక్క జొన్న నేలకొరగడంతో పాటు కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిలిచిన కారణంగా పత్తిలో రసం పీల్చు పురుగులు, మొక్క జొన్నలో కాండం కుళ్లు వ్యాపించాయి.

నష్టం ఎక్కువగా జరిగిన జిల్లాలు.. 

ఖమ్మం, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్,  మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలలో ఎక్కువ శాతం పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్, నారాయణపేట, భద్రాద్రి, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో 2.50 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా మునిగిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1,43,304 మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా అత్యధికంగా  77,394 ఎకరాల పంట దెబ్బతింది. మెదక్ జిల్లాలో 23,169 ఎకరాల్లో పంటల నష్టం జరగ్గా.. 24,808 మంది రైతులకు నష్టం వాటిల్లింది.  అదిలాబాద్‌లో  21,276 ఎకరాలు నీట మునిగిపోవడంతో 8,071 మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్‌లో  18,417 ఎకరాలు దెబ్బతిన్నాయి, 9,155 మంది రైతులు నష్టపోయారు. అసిఫాబాద్‌లో 15,317 ఎకరాలు మునిగిపోయి 7,259 మంది అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 46,374 మంది రైతులు, మహబూబాబాద్ జిల్లాలో 18,089 మంది,  సూర్యాపేలో 9,227 మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది. మిగతా జిల్లాలలోనూ పంట నష్టం భారీగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ భారీ వర్షాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీరు నిండి ఉన్నందున అంచనా వేసి నివేదిక పూర్తికాలేదని అధికారులు వెల్లడించారు. పూర్తిస్థాయి నివేదిక తయారైన అనంతరం నష్టం వివరాలు సమగ్రంగా తెలుస్తాయని తెలిపారు. 

ప్రకృతి కన్నెర్ర  కుభీర్ రైతులకు భగ్గుమన్న నష్టం

కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో వర్షాలు రైతులకు పెద్ద దెబ్బ కొట్టాయి. ప్రధాన పంటలు సోయాబీన్, పత్తి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. చేతికొచ్చిన సోయాబీన్ పంట నీట మునిగి గింజలకు మొలకలు వచ్చి రైతులు భాధపడుతున్నారు. మరోవైపు పత్తి చెట్లపై కాయలు పగిలిపడి, వర్షానికి తడిసి నల్లబడి నేలకొరిగిపోతున్నాయి. దీంతో రైతాంగం కన్నీళ్ల మునిగిపోయింది. మండలంలో మొత్తం 50,788 ఎకరాలు సాగులో ఉండగా, అందులో సోయాబీన్ 22,855 ఎకరాలు, పత్తి 24,066 ఎకరాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. ప్రధానంగా సోయా, పత్తి పంటలే రైతుల కష్టార్జితాన్ని దెబ్బతీశాయి.

పత్తి పంటతో రైతన్న మరింత కుదేలు.. 

ఇక పత్తి పంటల కోసం రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు కలిపి ఎకరాకు రూ. 40 నుంచి రూ. 50 వేల వరకు పెట్టుబడి ఖర్చు చేశారు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్ల దిగుబడి కావాల్సి ఉంటుంది. క్వింటాకు రూ. 8,110 మద్దతు ధర పలికికితే రూ. 80 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎకరాకు 5 నుంచి 6 క్వింటాలు పత్తి మాత్రమే దిగుబడి అయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పత్తి రంగు మారడం వల్ల మద్దతు ధర వస్తుందనే నమ్మకం లేదని, దిగుబడి కూడా 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో భారీగా పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కష్టమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పరిహారం వంటి అంశాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విపరీతమైన వర్షాలతో రైతుల కలలు కూలిపోవడంతో, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అందరి చూపు నిలిచింది. అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంది. ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. వాటికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసి పంపిణీ చేశారు. ఈ సారి కూడా అదేవిధంగా నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.