calender_icon.png 4 October, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ పటం నుంచి పాక్‌ను తుడిచేస్తాం

04-10-2025 02:01:25 AM

  1. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇకనైనా ఆపాలి
  2. లేకుంటే.. పాక్ భౌగోళిక అస్తిత్వం లేకుండా చేస్తాం
  3. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
  4. రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్ ఆర్మీచెక్ పోస్ట్ సందర్శన
  5.   2035 కల్లా ‘సుదర్శన చక్ర వ్యవస్థ’: భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్
  6. న్యూఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్.. భారత్ శక్తి చాటి చెప్పేందుకే ‘ఆపరేషన్ సిందూర్’ అని ఉద్ఘాటన

న్యూఢిల్లీ/జైపూర్, అక్టోబర్ 3: ‘ప్రపంచ మ్యాప్‌లో ఉండాలనుకుంటే పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందే. లేదంటే దాయాది భౌగోళిక, చారిత్రక అనవాళ్లను తుడిచేస్తాం. ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో చూపిన సహనం చూపం. సంయమనం పాటించం. త్వరలో ఆపరేషన్ సిందూర్ 2.0 ఉంటుంది. భారత సైన్యం సిద్ధంగా ఉంది. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాల్లేకుండా ధ్వంసం చేస్తాం. భగవంతుడు అనుకుంటే.. ఆ అవకాశం త్వరలోనే వస్తుంది’ అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీచేశారు.

రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లా అనూప్‌గఢ్‌లోని ఆర్మీ చెక్ పోస్ట్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మీచీఫ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత భారత సైన్యం మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిందని, 26 మంది భారతీయులను పొట్టనపెట్టుకున్న ఘటనకు ప్రతీకారంగా ఈ ఆపరేషన్ పట్టామని తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాల ఆధారాలను ప్రపంచానికి చూపించిందని తెలిపారు. భారత్ ఆ ఆధారాలను బయటపెట్టకపోయుంటే, పాకిస్తాన్ వాటిని దాచేసేదని అభిప్రాయపడ్డారు.

భారత సైన్యం తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడి చేసిందని, వాటిలో ఏడు స్థావరాలపై ఆర్మీ, రెండు స్థావరాలపై ఎయిర్ ఫోర్స్ దాడి చేసిందని వివరించారు. భారత్‌కు పశ్చిమాన ఉన్న సర్ క్రీక్ ప్రాంతం లో దాయాది సైన్యం చురుగ్గా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, పాక్ వక్రబుద్ధి చూపిస్తే, ఇక ఆ దేశ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని హెచ్చరించారు. భారత సైన్యం కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసిందని, దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు. పాక్ పౌరులతో తమకు ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. 

శత్రు దుర్భేద్యంగా ‘సుదర్శన చక్ర’: భారత వాయుసేన చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్

భారత వాయుసేన అమ్ముల పొదిలోకి ‘సుదర్శన చక్ర’ రక్షణ వ్యవస్థ రా నున్నదని, ఈ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉంటుందని, గగత భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత వాయుసేన తన ప్ర తాపాన్ని చూపిందని కొనియాడారు. భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకే ‘సుద ర్శన చక్ర’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వాయుసేన వార్షిక విజయాలపై శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘సుదర్శన చక్ర’తో కీలకమైన వ్యవస్థలకు రక్షణ కల్పిస్తామని, దేశాన్ని శత్రు దుర్బేధ్యంగా తయారు చేస్తామని వెల్లడించారు.

త్రివిధ దళాలూ ఆ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు పని ప్రారంభించాయని స్పష్టం చేశారు. 2035 నాటికల్లా ఈ కొత్త భద్రతా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ స్పష్టమైన లక్ష్యంతో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిందని స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి పాక్‌కు చెందిన పది ఫైటర్ జెట్ విమానాలను ధ్వంసం చేశామని అమర్‌ప్రీత్‌సింగ్ స్ప ష్టం చేశారు. ధ్వంసమైన వాటిలో ఎఫ్-16, జేఎఫ్- -17 యుద్ధ విమానాలు కూ డా ఉన్నట్లు తెలిపారు.

శత్రువుల స్థావరాలను గురిచూసి టార్గెట్ చేశామని, పాక్ లోని ఉగ్రస్థావరాలతో పాటు రాడార్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రన్‌వేలు, హ్యాంగర్‌లు, యుద్ధ విమానా లు ధ్వంసం చేశామని వివరించారు. పాక్ పరిధిలోని సుమారు 300 కిమీ మేర ఉన్న లక్ష్యాలను ఛేదించామని తెలిపారు. పాక్‌ను భారత సైన్యం మోకాళ్లపై కూర్చోబెట్టిందని, కాల్పుల విరమణపై పాక్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసిందని తెలిపారు.

కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతోనే అది సాధ్యమైందని పేర్కొన్నారు. పాకిస్థాన్ కోరడంతోనే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ నిలిపివేత వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం లేదని, పాకిస్థాన్ ప్రభుత్వమే భారత్‌ను శాంతికి అభ్యర్థిం చిందని వాయుసేన అధిపతి స్పష్టం చేశారు.