calender_icon.png 10 July, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎగ్జిమా.. కనిపించే శత్రువు

06-07-2025 12:00:00 AM

ఎగ్జిమా.. ఎండు గజ్జి.. ఈ సమస్య మానసికంగా, శరీరకంగా వేధించే అతి పెద్ద సమస్య. ఒక్కసారి చర్మాన్ని పట్టిందంటే జీవితకాలం తగ్గకుండా తీవ్రమైన దురదతో వేధిస్తుంది. గోకటం మొదలెడితే చేయిని ఆపడం ఉండదు. చర్మాన్ని గోకటం వల్ల చర్మం గీసుకుపోవడం.. వాపు సహజం. కానీ ఇన్‌ఫెక్షన్ తలెత్తి పొక్కులు ఏర్పడతాయి. అవి పగిలి నీరుపడుతుంది.

క్రమంగా ఎండిపోయి.. చర్మం గరుకుగా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చర్మం మరింత దెబ్బతినకుండా, ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. ఎండు గజ్జి వస్తే.. ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. 

దురద పుడితే గోకకుండా ఎలా ఉంటాం? ఇక గజ్జిలోనైతే అది మరింత కష్టం. అయినా కూడా వీలైనంత వరకు గోకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. గోళ్లతో గోకటానికి బదులు వేలి చివర్లతో నొక్కి పట్టొచ్చు. లేదా రుద్దొచ్చు. గజ్జి ఉన్న చోటును చూడకుండా ఉండడమూ మేలు చేస్తుంది. చూడకపోతే గోకాలనే ఆలోచనా తగ్గుతుంది. 

చర్మం పొడిబారకుండా..

దెబ్బతిన్న చర్మం తేమను సరిగా పట్టి ఉంచలేదు. కాబట్టి అక్కడ రోజుకు చాలాసార్లు మందంగా మాయిశ్చరైజర్ రాసుకోవడం మేలు చేస్తుంది. ఇది తేమను పట్టి ఉంచటం ద్వారా హాయిని కలిగిస్తుంది. దురద భావన తగ్గుతుంది. మినరల్ నూనె, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకోవడం ఉపయోగపడతాయి. వీటిల్లో చర్మానికి సరిపోయినవి ఎంచుకోవాలి. 

గోరువెచ్చటి నీటితో..

ఓట్స్‌లోని ప్రత్యేక రసాయన మిశ్రమాలు చర్మం పైపొరను బలోపేతం చేస్తాయి. కాబట్టి ఓట్స్ అటుకులను మెత్తగా పొడి చేసి, గోరు వెచ్చటి నీటిలో కలిపి పది నిమిషాల సేపు స్నానం చేయడం మంచిది. స్నానం పూర్తయ్యాక తువ్వాలుతో అద్దుకొని, చర్మం పొడిగా ఉండేలా చేసుకోవాలి. ఆ వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. 

తడిలేకుండా..

దురద తీవ్రంగా ఉన్నప్పుడు తడి పొర హాయిని కలిగిస్తుంది. ఇది ఉబ్బిన చర్మానికి సాంత్వన చేకూరుస్తుంది. తేమను పట్టి ఉంచుతుంది. బ్యాండేజీ గుడ్డను గోరు వెచ్చటి నీటిలో ముంచి, దాన్ని గజ్జి ఉన్నచోట పెట్టి నెమ్మదిగా అదమాలి. దీని మీద పొడి బట్టను గానీ బ్యాండేజీ గుడ్డను కానీ చుట్టాలి. కొద్ది గంటల పాటు అలాగే ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రంత ఉంచినా మేలే. అయితే తడి ఆరకుండా చూసుకోవాలి. 

అలర్జీ మందులు

దురద మరీ ఎక్కువగా ఉంటే సిట్రిజిన్, ఫెక్సోఫెనడైన్ వంటి యాంటీహిస్టమిన్ మాత్రలు వాడుకోవచ్చు. ఇవి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. అయితే డైఫెనీడ్రమైన్ మందు నిద్రమత్తు కలిగిస్తుంది. ఇలాంటి మందులను పడుకునేటప్పుడు వేసుకోవాలి. వీటిని వేసుకుని వాహనాలు నడపటం వంటి పనులు చేయొద్దు. 

మానసిక ఒత్తిడితో

మానసిక ఒత్తిడి వల్ల కూడా ఎగ్జిమా పెరుగుతుంది. ఒత్తిడికి లోనైనప్పుడు కార్టిజోల్ హార్మోన్ పెద్ద ఎత్తున విడుదలవుతుంది. ఇది అన్ని అవయవాలతో పాటు చర్మానికీ చేరుకొని, ప్రభావం చూపుతుంది. మరోవైపు అలర్జీని తెచ్చిపెట్టే హిస్టమిన్లూ విడుదలవుతాయి. ఇవి దురదను పుట్టించి, ఎగ్జిమాకు దారితీస్తాయి.

అలాగే ఒత్తిడి ప్రతిస్పందనలో భాగంగా పుట్టుకొచ్చే ఇమ్యునోగ్లోబులిన్ ఇ కూడా దురదను మరింత ఎక్కువ చేస్తుంది. మొత్తం మీద మానసిక ఒత్తిడి మూలంగా ఒంట్లో తలెత్తే ప్రతిచర్యలు చర్మం మీదా ప్రభావం చూపుతాయి. లోపల ఒత్తిడిని ఇలా బయటకు ప్రతిబింబించేలా చేస్తాయి. 

లక్షణాలు

బ్యాక్టీరియా వంటి హానికారకాలు శరీరంలోకి ప్రవేశించకుండా చర్మం కోట గోడలా అడ్డుకుంటుంది. చర్మం మీద మంచి చేసే సూక్ష్మక్రిములతో పాటు నూనెలు, తేమ కూడా ఉంటాయి. ఇవన్నీ చర్మం ఆరోగ్యానికి తోడ్పడతాయి.

కార్టిజోల్ హార్మోన్ చర్మం నూనెల ఉత్పత్తినీ దెబ్బతీస్తుంది. దీంతో చర్మం పొడిబారి, చికాకు పుడుతుంది. ఎండుగజ్జి గలవారిలో చర్మం పొడిబారటం, గరుకుగా అవ్వటం, దురద, దద్దు, వాపు, అక్కడక్కడా మందం కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒత్తిడి పెరుగుతున్నకొద్ది ఇవి ఎక్కువవుతుంటాయి. 

జాగ్రత్తలు..

- కఠినమైన, మరీ ఘాటు వాసనలతో కూడిన సబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవి చర్మం నుంచి సహజ నూనెలను ఎక్కువగా తొలగిస్తాయి. వీటిల్లోని వాసనలు, రంగులు, సుగంధ ద్రవ్యాలు దురద, అలర్జీకి కారణం కావొచ్చు. కాబట్టి స్నానానికి మృదువైన సబ్బులు వాడుకోవాలి. 

- బిగుతైనవి, అలాగే గరుకుగా ఉండే ఉన్ని దుస్తులు చర్మానికి చికాకు కలిగిస్తాయి. అందువల్ల వదులైన దుస్తులు వేసుకోవాలి. మెత్తటి, నూలు దుస్తులైతే మరీ మంచిది.

- గజ్జి ఉన్నవారికి చెమట మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. కాబట్టి గదిలో ఫ్యాన్, ఏసీ వేసుకోవాలి. గాలి ఆడే దుస్తులు ధరించాలి. 

- వేడి, పొడి గాలి చర్మం నుంచి తేమను లాగేస్తుంది. ఇది దురద పుట్టేలా చేస్తుంది. అందువల్ల వీలైతే ఇంట్లో హ్యూమిడిఫర్ పరికరం అమర్చుకోవాలి. ఇది నీటి ఆవిరిని గాలిలోకి వెదజల్లుతుంది. ఇలా చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది.

- మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం. ప్రతికూల ఆలోచనలు దూరం చేయడం కోసం యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులతో మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే మానసిక నిపుణుల సాయం తీసుకోవాలి.

- మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయాటిక్స్‌ను ఆహారంలో చేర్చుకోవటం ఉపయోగపడుతుంది. ఇవి గజ్జి అదుపులో ఉండటానికి, లక్షణాలు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రొబయాటిక్స్ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. అలర్జీలను నియంత్రిస్తాయి. మనం రోజూ వాడే పెరుగు, మజ్జిగ ప్రొబయాటిక్స్‌గా ఉపయోగపడతాయి. ఇవి మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. 

 కె.క్రాంతి వర్మ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ రెనోవా హాస్పిటల్స్, సనత్ నగర్, హైదరాబాద్

ఎండుగజ్జి, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమస్యలకు దగ్గరి సంబంధం ఉంది. నిజానికి ఎగ్జిమా గలవారిలో 30 శాతానికి పైగా మందిలో ఆందోళన, కుంగుబాటూ కనిపిస్తుంటాయి. పైకి స్పష్టంగా కనిపించే, బాగా దురద పెట్టే దీర్ఘకాల చర్మ సమస్యలేవైనా రోజువారీ జీవితం మీద చాలా ప్రభావం చూపుతాయి.

ఇవి నిద్రను, మూడ్‌ను దెబ్బతీస్తాయి. ఇతరులు చూస్తే ఏమనకుంటారోననే భావనతో నలుగురిలోకి వెళ్లడానికీ వెనకాడుతుంటారు. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ ఆందోళన, కుంగుబాటూ పెరుగుతాయి. ఇదో విష వలయంగా మారుతుంది. కాబట్టి దీన్ని ఛేదించే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ఎండుగజ్జిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.

వ్యాయామం: దీంతో హాయి భావన కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. సానుకూల భావనలు పుంజుకుంటాయి. ఆనందం, సంతోషంతో చేసే ఎలాంటి వ్యాయామమైనా ఉపయోగపడుతుంది. ఎంత ఎక్కువగా శ్రమిస్తే అంత ఎక్కువగా ఎండార్ఫిన్లు పుట్టుకొస్తాయి. అయితే వ్యాయామం చేశాక గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మరవొద్దు. లేకపోతే చెమట, దద్దు చర్మాన్ని చికాకుకు గురిచేస్తాయి. 

నిద్ర: ఒత్తిడి, గజ్జి తోడైతే కంటి నిండా నిద్ర పట్టడం కష్టం. కానీ నిద్ర పట్టేలా చూసుకోవడం అత్యవసరం. రోజూ వేళకు పడుకోవడం, లేవటం.. పడుకోవడానికి ముందు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాలకు దూరంగా ఉండటం.. పడకగది ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవడం వంటి వాటితో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు. రోజులో కనీసం 7 గంటలు నిద్రించాలి.