10-07-2025 12:07:59 AM
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): బడులకు డుమ్మా కొట్టే టీచర్లు, వారి స్థానంలో విద్యావాలంటీర్‌ను పెట్టి డ్యూటీలకు ఎగనామం పెట్టే టీచర్ల ఆటలు ఇక సాగవు. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్) అమల్లోకి రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి పంపించారు.
ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని గతేడాది నుంచే అమలు చేయాలని భావించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఎఫ్‌ఆర్‌ఎస్ విద్యార్థులకున్నప్పుడు టీచర్లకు ఎందుకు ఉండకూడదనే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఆ దిశగా దృష్టిసారించిన అధికారులు త్వరలోనే అమలు చేయాలని భావిస్తున్నారు.
ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. గత రెండేళ్ల నుంచే ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ అమలు చేస్తున్నారు. అయితే తొలుత ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ విధానం ఉండేది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అది మరుగున పడింది. ప్రస్తుతం టీచర్లు రిజిస్టర్‌లోనే సంతకాలు చేస్తున్నారు. దీంతో ఇష్టానుసారంగా కొంత మంది టీచర్లు డుమ్మాలు కొడుతున్నారనే విమర్శలున్నాయి.
కొంత మంది టీచర్లు ఆ రోజు విధులకు హాజరుకాకున్న మరుసటి రోజువచ్చి హాజరైనట్టు సంతకాలు పేట్టేవారు. లేదంటే పాఠశాలకు వచ్చి హాజరు వేసుకొని మధ్యలోనే వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఓ టీచర్ ఆయన స్థానంలో విద్యావాలంటీర్‌ను పెట్టిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో టీచర్లు ఎంత మంది విధుల్లో ఉంటారో చెప్పడం కష్టమే.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. టీచర్ పాఠశాలలో ఉన్నారా? లేదో? తెలిసిపో తోంది. ఇప్పటికే ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే ఆలస్యం దీన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
పనితీరు ఇలా..
స్కూళ్లకు అందజేసిన/ టీచర్ల స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్‌లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. తర్వాత బడుల వారీగా టీచర్ల రిజిస్ట్రేషన్‌ను చేపట్టి వారి ఫొటోలను అప్‌లోడ్ చేస్తారు. టీచర్ స్మార్ట్‌ఫోన్ తెరిచి స్కాన్ చేయగానే ఎఫ్‌ఆర్‌ఎస్ అప్లికేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి అందులో ఉన్న ఫొటోలను పోల్చుకుంటుంది. ఆ ఫొటోల ఆధారంగా ఆ రోజు ఎంత మంది టీచర్లు హాజరయ్యారో తెలిసిపోతోంది. అంతేకాకుండా జియోగ్రాఫికల్ లోకేషన్‌ను కూడా ఇది గ్రహిస్తుంది. టీచర్ ఎక్కడ ఉన్నారో సులువుగా తెలుసుకోవచ్చు.