calender_icon.png 10 July, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైహీల్స్ చెప్పుల్లో డ్రగ్స్

10-07-2025 12:15:50 AM

  1. హైదరాబాద్‌లో హైటెక్ డ్రగ్స్ రాకెట్
  2. పబ్‌లు, డాక్టర్లే టార్గెట్‌గా నైజీరియన్ కొరియర్ల ద్వారా సరఫరా 
  3. రెస్టారెంట్ ఓనర్‌తో సహా ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో నగరంలో సంచలనం సృష్టిస్తున్న హైటెక్ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో ‘ఈగల్’ ఛేదించింది. కొంపల్లిలోని ఓ రెస్టారెంట్ కేంద్రంగా నైజీరియన్లతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందా నడుపుతున్న ముఠా గుట్టురట్టు చేసింది. మహిళల చెప్పుల మడమల్లో(హైహీల్స్) కొకైన్ దాచి కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్న తీరు అధికారులనే  విస్మయపరిచింది.

ఈ కేసులో ప్రధాన సూత్రధారి, రెస్టారెంట్ యజమాని సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌కు నగరంలోని పలు ప్రముఖ పబ్‌లు, ప్రముఖ కార్డియాలజీ డాక్టర్‌తోనూ సంబంధాలు ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది. నిర్దిష్ట సమాచారం మేరకు ‘ఈగల్’ బృందం మంగళవారం జూలై 7 రాత్రి కొంపల్లిలోని ‘మల్నాడు కిచెన్’ రెస్టారెంట్ యజమాని సూర్య అన్నమనేని (34)ని అతడి స్కార్పియో వాహనంలో అదుపులోకి తీసుకుంది.

వాహనాన్ని తనిఖీ చేయగా, 10 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 1.6 గ్రాముల ఎక్స్‌టీసీ పిల్స్(దీనిని డిజైనర్ డ్రగ్ అని పిలుస్తారు. ఇది ఉల్లాసమైన అనుభూతిని రోజుల తరబడి కలిగిస్తుంది) లభ్యమయ్యాయి. ఢిల్లీ నుంచి  ఫాతిమా అనే పేరుతో శ్రీ మారుతి కొరియర్ ద్వారా వచ్చిన ఓ పార్శిల్‌లోని హైహీల్స్ చెప్పుల మడమ భాగంలో కొకైన్‌ను అత్యంత చాకచక్యంగా దాచిపెట్టారు.

విచారణలో సూర్య వెల్లడించిన విషయాలు ప్రకారం.. బీటెక్, ఎంబీఏ చదివి, బెంగళూరులో సేల్స్ మేనేజర్‌గా పనిచేసిన సూర్య, 2020లో హైదరాబాద్ వచ్చి రెస్టారెంట్ ప్రారంభించాడు. అనతికాలంలోనే కాలేజీ స్నేహితులు, నైజీరియన్లతో కలిసి డ్రగ్స్ సరఫరాలోకి దిగాడు.

ఢిల్లీ, బెంగళూరు, గోవాలకు చెందిన నిక్, జెర్రీ, డెజ్మండ్, స్టాన్లీ, ప్రిన్స్ వంటి నైజీరియన్ల నుంచి భారీగా కొకైన్, ఎండీఎంఏ కొనుగోలు చేసేవాడు. ఇటీవల నిక్ బ్యాంకు ఖాతాకు తన రెస్టారెంట్ టెర్నియన్ హాస్పిటాలిటీ ఖాతా నుంచి రూ. 1.39 లక్షలు, ఏటీఎం ద్వారా మరో రూ. 41,000 బదిలీ చేసినట్లు ఒప్పుకున్నాడు. 

కస్టమర్లలో ప్రముఖులు..

సూర్య కస్టమర్ల జాబితాలో ప్రముఖులు ఉన్నట్లు తేలింది. భీమవరానికి చెందిన ఓ ప్రముఖ కార్డియాలజీ డాక్టర్ ప్రసన్న, సూర్య స్నేహితుడు హర్ష ద్వారా ఇప్పటివరకు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీరితో పాటు 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది.

ప్రిజం పబ్, ఫామ్ పబ్, బ్లాక్ 22, బర్డ్ బాక్స్, జోరా, బ్రాడ్‌వే వంటి పబ్‌లలో సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవాడని, ఇందుకు ఆయా పబ్ యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసేవని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో క్వాక్ అరేనా పబ్ యజమాని రాజశేఖర్, జోరా పబ్ యజమాని పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్‌వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈగల్ బృందం ఎన్‌డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. పట్టుబడిన నిందితులను రిమాండ్ తరలించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరు కీలక వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

డ్రగ్స్‌పై సమాచారం ఇవ్వండి: ఈగల్

డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలపై సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఈగల్ బృందం ప్రజలను కోరింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నమ్మ కమైన సమాచారానికి బహుమతి ఉంటుందని ప్రకటించింది.