10-07-2025 12:13:24 AM
మాఫియా చేతుల్లో కల్లు దందా
రాజకీయ నాయకుల అండదండలు
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
మేడ్చల్, జూలై 9(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో కల్లు మాఫియా రెచ్చిపోతోంది. కల్లు దందాను గుప్పెట్లో పెట్టుకుని పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. మత్తు పదార్థాలు, రసాయనాలతో కృత్రిమ కల్లు తయారుచేసి జోరు గా విక్రయాలు సాగిస్తోంది. కూకట్పల్లి ఘటనకు కృత్రిమ కల్లే కారణమని తెలుస్తోంది. కల్తీకల్లు తాగి అస్వస్థకు గురయ్యారని వైద్యాధి కారి సైతం ప్రకటించారు.
ఈ ఘటన ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వాస్తవానికి జిల్లాలో ఈత, తాటి చెట్లు కూకట్పల్లి, మల్కాజ్గిరి, ఉప్పల్ ప్రాంతాల్లో లేవు. ఈ ప్రాంతాల్లో అసలు ఖాళీ స్థలాలే లేవు. కానీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చెట్లు లేకున్నప్పటికీ కల్లు విక్రయా లు జరుగుతున్నాయంటే అది కృత్రిమ కల్లేనని స్పష్టమవుతోంది. మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రమే కొన్ని చెట్లు ఉన్నాయి.
హానికర పదార్థాలతో తయారీ
కాయకష్టం చేసి అలసట నుంచి ఉపశమనానికి పేద ప్రజలు కల్లు తాగుతుంటారు. ఎక్కువ ధరకు మద్యంకొనే స్తోమత లేక కల్లు కొనుగోలు చేస్తారు. కల్లును మత్తు పదార్థాలు, రసాయనాలతో తయారు చేయడం వల్ల పేద ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. కూకట్పల్లి ఘటనలో ఐదుగురికి కిడ్నీలు చెడిపోయాయి అంటే ఈ కల్లు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. కిడ్నీలే కాకుండా ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయని వైద్యులు చెబుతున్నారు.
డైజోఫామ్, ఆల్ఫా జోలం, క్లోరోహైడ్రేట్, క్లోరోఫామ్, సాక్రీన్, తెల్ల పౌడర్, కుంకుడుకాయలు, యూరియా వంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు వినియోగించి కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు. వీటితో తయారైన కల్లు కు బానిసైనవారికి రోజు ఉండాల్సిందే.
వివిధ కారణాలవల్ల రెండు మూడు రోజులు తాగకుంటే కాళ్లు వంకర్లు పోవడం, మతిస్థిమితం కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఈ కల్లుకు అలవాటైన వారు ముంబై, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లినవారు తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వీధికో కల్లు దుకాణం
కల్లు మాఫియా వీధికో దుకాణం ఏర్పా టు చేసి కల్లు విక్రయాలు సాగిస్తోంది. రెండు మూడు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకుని 10 దుకాణాల వరకు ఏర్పాటు చేశారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు అనధికార దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. మేడ్చల్ పట్టణంలో కేవలం ఐదు దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ 10 దుకాణాలకు పైన నడుస్తున్నాయి.
మండలంలో, జిల్లాలో మొత్తం అదే పరిస్థితి ఉంది. మేడ్చల్ జిల్లాలో 2 ఎక్సైజ్ సూపరిండెంటెంట్ కార్యాలయాలు ఉన్నాయి. ఇద్దరూ ఈఎస్‌లు ఉన్నప్పటికీ కల్తీకలు విక్రయాలు అరికట్టలేకపోతున్నారు. ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల్లో సిబ్బంది సరిగా విధులకు హాజరు కావడం లేదు. కల్లు దుకాణాలను తనిఖీ చేయడం లేదు. కల్తీ కల్లు విక్రయిస్తున్నారని తెలిసిన ఒక కేసు నమోదు చేయలేకపోయారు.
మాఫియా మామూళ్ళు పంపిణీ చేయడం, రాజకీయ నాయకుల ఒత్తిడిల వల్ల అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కూకట్పల్లి ఘటనకు కారకులైన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి రాజకీయ నాయకులు మద్దతిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.