18-10-2025 09:34:36 PM
సూర్యాపేట,(విజయక్రాంతి): కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడేలా పోలీస్ సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. జిల్లా కేంద్రంలో గల పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ స్టేషన్ల నుండి కోర్టు విధుల పర్యవేక్షణ కోసం పనిచేస్తున్న కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందికి శనివారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కోర్టు విధుల నిర్వహణకు సంబంధించి సలహాలు, సూచనలు చేస్తూ పనిలో నాణ్యత, పారదర్శకత ఉండాలన్నారు. పెండింగ్ ఉండకుండా పని చేయాలి, కోర్టు వారెంట్, సమన్ లు సకాలంలో అందజేయాలన్నారు.
సిబ్బంది కోర్టులలో సమన్వయంగా సమయపాలనతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు కేసుల స్థితిగతులను రికార్డులలో, అంతర్జాలంలో నమోదు చేసుకోవాలని సూచించారు. బాధితులను, సాక్షులను, నిందితులను సకాలంలో కోర్టులకు ప్రవేశపెట్టి కేసులు పరిష్కారం అయ్యేలా పనిచేయాలన్నారు. కేసుల్లో త్వరితగతిన నేరస్తులకు శిక్షలు అమలు అయితేనే క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. ఒక లక్ష్యంతో పని చేస్తూ కోర్టు అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని సూచించారు.