18-10-2025 09:31:04 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి లో యువతను క్రీడారంగంలో అభివృద్ధి చేసేందుకు మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. శనివారం ఆయన స్థానిక తాసిల్దార్ గన్యా ఇతర అధికారులతో కలిసి మినీ క్రీడా స్టేడియం ఏర్పాటుకు అనువైన స్థల సేకరణ కోసం పరిశీలన చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి అక్కడి వసతులను కళాశాల భవన సముదాయాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములకలపల్లి పూర్తి గిరిజన ప్రాంతం అయినప్పటికీ ఇక్కడి యువత క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని,క్రీడాకారులకు కొదువా లేదన్నారు. కబడ్డీ, వాలీబాల్, బాల్ బాడ్మింటన్ క్రీడా పోటీల్లో ఇక్కడి యువకులు ప్రతిభ కనబరుస్తున్నారని వారి ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు మినీ క్రీడా స్టేడియాన్ని నిర్మించడానికి అనువైన స్థలాన్ని సేకరించాల్సిందిగా తాసిల్దార్ గన్యాకు సూచించారు. విద్యతోపాటు క్రీడారంగాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రజా పాలన ప్రభుత్వ ధ్యేయం అన్నారు.