01-07-2025 01:37:18 AM
గ్రామాల్లో ప్రత్యేక శిబిరం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తాం..
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల:జూన్ 30(విజయక్రాంతి); మిడ్ మానేర్ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. మిడ్ మానేర్ ప్రాజెక్ట్ బోయినపల్లి మండలంలోని ముంపు గ్రామాలు కొదురుపాక, వరద వెల్లి, నీలోజిపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ఇండ్లకు పరిహారం, 18 ఏండ్లు నిండిన యువతకు పరిహారం రాలేదని, కమ్యూనిటీ హాళ్లు, ఆలయాలు, ఆర్టీసీ బస్ షెల్టర్, స్కూల్ బిల్డింగ్ పరిహారం రాలేదని ఇతర సమస్యలను ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడారు. మానవతా దృక్పథంతో అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులందరికీ పరిహారం, మిగితా బెనిఫిట్స్ వచ్చేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
దరఖాస్తులపై మరోసారి అధికారులతో సర్వే చేయిస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రత్యేక శిబిరం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తాము.రెవెన్యూ అధికారులు ప్రత్యేక శిబిరం ద్వారా సమావేశాలు నిర్వహించి, నిర్వాసితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆయా గ్రామాల నిర్వాసితులు తమ సమస్యల పై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో వేములవాడ ఆర్డీవో ఎస్డీసీ రాధాబాయ్, బోయినపల్లి తహసిల్దార్ నారాయణ రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.