calender_icon.png 1 July, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టాల కడలిలో బ్రాహ్మణ పరిషత్

01-07-2025 01:37:20 AM

  1. పాలకమండలి రద్దు, నిధుల మంజూరులో జాప్యం 
  2. ఆందోళనలో విదేశీ విద్యా, బెస్ట్ పథకాల లబ్ధిదారులు 
  3. ఇంకా ఆర్థిక సాయం అందని విద్యార్థులు 288 మంది 
  4. రూ.12.50 కోట్ల ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం ఎదురుచూపులు  
  5. మెరుగైన నిర్వహణకు చర్యలు తీసుకోవాలంటున్న బ్రాహ్మణ సంఘాలు

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరి షత్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పాలకమండలి రద్దు, పథకాల అమలులో ఆల స్యంతో పేద బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి. దానిలో భాగంగానే అప్పటి ప్రభుత్వం 2017 జనవరి 28న పేద బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ప్రారంభించింది.

పరిషత్ ద్వారా పథకాల అమలు, నిర్వహణకు రూ.100కోట్లు కేటాయించింది. రాష్ర్టంలోని బ్రాహ్మణుల అభ్యున్నతికి బలమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలనే సదుద్దేశంతో దాదాపు 17పథకాలకు రూపకల్పన చేశా రు.  అందులో బ్రాహ్మణ సమాజానికి చెం దిన వారికి వ్యాపార అవకాశాలను కల్పించడానికి బెస్ట్(తెలంగాణ బ్రాహ్మణ వ్యవ స్థాపకత పథకం-బ్రాహ్మిణ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీమ్ ఇన్ తెలంగాణ) పథకా న్ని ప్రారంభించింది.

ఈ పథకం కింద రా ష్ర్టంలోని యువ వ్యవస్థాపకులు స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ‘వివేకానంద’ పేరుతో విదేశీ విద్యా పథకం, ‘శ్రీ రామానుజ’ పేరుతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, ‘వేదహిత’ పేరుతో వేద పాఠశాలలకు, వేద విద్యార్థులకు ఆర్థిక సాయం, ప్రతీ నెల వేద శాస్త్ర పండితులకు గౌరవ వేతనం, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం, బ్రాహ్మణ యువతకు పోటీ పరీక్షల శిక్షణ వంటి పథకాలను పొందుపరిచారు.

2023 మే 31న బ్రాహ్మణుల సంక్షేమం కోసం అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ.12 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో విప్రహిత పేరుతో బ్రాహ్మణసదన్ నిర్మించింది. ఈ విప్రహిత బ్రాహ్మణసదన్ వినియోగంలోకి వచ్చింది. 

ఎదురుచూపులు..

రూ.5 లక్షలు అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే రూ. 20లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. కుటీర పరిశ్రమల ఏర్పాటుకు, స్వయం ఉపాధి వ్యాపారాలకు సబ్సిడీతో కూడిన బెస్ట్ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తారు.

2023 ఆగస్టు నుంచి బ్రాహ్మణ పరిషత్ ద్వారా స్కీంల నిర్వహణ అనుకున్నంత లేదని, బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఉపా ధి, స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సాయం పొందుదామనుకుంటున్న లబ్ధిదారులు తమ అసంతృప్తిని వ్య క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్, విదేశీ విద్య పథకాలకు 2024-25 బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయిస్తే దీనిలో 2025 మార్చిలో రూ. 25 కోట్లు విడుదలయ్యాయి.

అయితే విదేశీ పథ కం లబ్ధిదారులకు అందజేసేందుకు రూ.12.50 కోట్లు ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారుల ఖాతాలో జమచేయకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటివరకూ 788 మంది లబ్ధిపొందగా వీరిలో 350 సంపూర్ణంగా లబ్ధిపొందారని, దీనికోసం దాదాపు రూ.83 కోట్లు పరిషత్ అందజేసిందని అధికారులు అంటున్నారు.

అయితే ఇంకా 288 మంది విద్యార్థులకు పరిషత్ ద్వారా ఆర్థిక సాయం అందుకోవాల్సి ఉందని, నిధులు ఎప్పుడు ఇస్తారని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మోతుకూరి రాము ప్రశ్నించారు.

సమస్యలు పరిష్కరించాల్సిందే..

 బ్రాహ్మణ సామాజికవర్గ విశ్వాసం చూరగొనాలంటే ప్రభుత్వం పరిషత్ కార్యకలాపాలను మరింత వేగంగా, మెరుగైన నిర్వహణకు చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సామాజిక సంఘాలు, లబ్ధిదారులు విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్యాపథకం, బెస్ట్ పథకాల లబ్ధిదారుల్లో నెలకొన్న ఆందోళన గమనించి వెంటనే నిధుల మంజూరు చేయాలని కోరారు. అలాగే కొత్త పాలకమండలి ఏర్పాటుతో పాటు ఆశించిన స్థాయిలో నిధులు, సంక్షేమ పథకాల అమలు కోసం కొత్త దరఖాస్తులు ఆహ్వానించాలని కోరారు.

పాలకమండలి రద్దు.. 

ప్రభుత్వం మారిన తర్వాత పాలకమండలి రద్దు అయింది. దీంతో పరిషత్ కార్యకలాపాల నిర్వహణ సందేహస్పదంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులు అరకొరగా ఉండటంతో కొత్త దరఖాస్తులను ఆహ్వానించలేని పరిస్థితి నెలకొన్నది.

కొంతకాలంగా కార్యకలాపాలు అంతంత మాత్రంగా ఉన్న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌ను పరిషత్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమించడం, ఆమెకు చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. గతంలో పరిషత్ చైర్మన్‌గా కేవీ రమణాచారి పదవీకాలం పూర్తిచేసున్న తర్వాత.. చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. 

నేడో రేపో రూ.25 కోట్లు విడుదలకు సన్నాహాలు

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు పరిషత్‌కు ప్రభుత్వం కేటాయించింది. మూడు నెలల కాలం గడిచినా దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు నేడో రేపో తొలివిడతగా రూ. 25కోట్లు నిధుల మంజూరుకు ప్రభు త్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేర కు ఎప్పుడైనా నిధుల విడుదలకు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు.