28-10-2025 07:03:33 PM
పాదాలు కడుక్కోకుండా స్వామి దర్శనం కలిగేనా..
రేగొండ (విజయక్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో ఉన్న కొండలపై వెలసిన శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక చొరవ చూపి జాతరలో సుమారు రూ.3 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఆలయం వద్ద జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా భక్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కొండపైకి వెళ్లే భక్తులు పాదాలు కడుక్కునే ట్యాంకు, నీటి పంపును అభివృద్ధి పేరుతో మొరంతో కప్పేస్తున్నారు.
అభివృద్ధి సరే..ప్రత్యామ్నాయం ఏది?
భక్తుల సౌకర్యార్థం అని చెబుతున్నప్పటికీ గతంలో ఉన్న సౌకర్యాలను తొలగించడం వాటికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివస్తారు.సుదూరం నుండి వచ్చే భక్తులు స్వామి వారి దర్శనానికి కొండ పైకి వెళ్లే క్రమంలో ప్రధానంగా పాదాలు కడుక్కొని దర్శనానికి వెళ్తారు.
భక్తులకు కలిగే ఈ అసౌకర్యం చిన్నదే కావచ్చు. కానీ పాదాలు కడుక్కోకుండా మనం ఇంట్లోకే వెళ్ళము. అలాంటిది స్వామి వారి దర్శనానికి ఎలా వెళ్తారనేదే అనేది ఇక్కడి సమస్య. బ్రహ్మోత్సవాల్లో భక్తులు లక్షల్లో వచ్చినపుడు వారి రద్దీని తట్టుకోవడం,వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం కాకుండా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ప్రత్యామ్నాయంగా, తాత్కాలికంగా నైనా నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను, ఆలయ కమిటీని వారు డిమాండ్ చేస్తున్నారు.